లష్కర్‌ బోనాలు షురూ… బోనం సమర్పించిన సీఎం రేవంత్‌


హైదరాబాద్‌(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు. మహాకాళి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేడు బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.