తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి

` గాల్లోకి గన్‌మెన్‌ కాల్పులు
` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న
` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి
` కార్యాలయంలోని ఫర్నీచర్‌, అద్దాలు ధ్వంసం
` ఖండిరచిన జర్నలిస్ట్‌, ప్రజా సంఘాలు
బోడుప్పల్‌(జనంసాక్షి):మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌ పై దాడి చేశారు.మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. దాడి సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు మల్లన్న గన్‌మెన్‌ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఆఫీస్‌పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తీన్మార్‌ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. జర్నలిస్ట్‌ సంఘాలు, ప్రజా సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిచాయి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్‌ మల్లన్న అన్నారు.
తీవ్రంగా స్పందించిన తీన్మార్‌ మల్లన్న
క్యూ న్యూస్‌ కార్యాలయంపై తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై తీన్మార్‌ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి కూడా గాయమైందని వెల్లడిరచారు. తన గన్‌ మన్‌ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటువంటి దాడులతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటేనని అన్నారు. బీసీల సమస్యలపై తాము ప్రభుత్వంతో పోరాడుతుంటే కవితకు ఎందుకు భాధ అని మల్లన్న ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు కేసీఆర్‌, కేటీఆర్‌ పై ఉన్న అసహనాన్ని కవిత తమపై ప్రదర్శిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పురిగొల్పిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా, తాను ఇటువంటి దాడులకు భయపడేది లేదని, మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కడం ఖాయం అని హెచ్చరించారు. అంతకు ముందు, ఓ కార్యక్రమంలో తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ… కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జాగృతి కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడికి దిగినట్టు సమాచారం ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది భ్రమేనని మల్లన్న చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.‘’ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 30 మంది దాడికి పాల్పడ్డారు. మా గన్‌మెన్లు ఎంత నిలవరించినా వినకుండా లోపలికి వచ్చారు. కవిత అనుచరుల దాడిలో నా చేతికి గాయమైంది. నా గన్‌మెన్‌ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేం చేసే ప్రయత్నం ఇసుమంత కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తాం. ఇలాంటి వాటికి నేను భయపడను. రాసి పెట్టుకోండి.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మేం పోరాడుతున్నాం. ప్రభుత్వం మా సలహాలను స్వీకరిస్తోంది.. పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటోంది. ఈ విషయంలో కవితకు ఎందుకు బాధ?ఉనికి కోసం అయితే కేసీఆర్‌ను అడగాలి. కేసీఆర్‌, కేటీఆర్‌పై ఉన్న ఫ్రస్ట్రేషన్‌ మాపై చూపిస్తామంటే కుదరదు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని మీ కుటుంబం దోచుకుతిన్నది. ఇలాంటి దాడులతో మరింత దిగజారి ప్రజల్లో చులకన కావడం తప్ప ఇంకేమీ ఉండదు. సహచర ఎమ్మెల్సీపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మా కార్యాలయంలో పడిన రక్తపు మరకల సాక్షిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం’’ అని తీన్మార్‌ మల్లన్న డిమాండ్‌ చేశారు.

మల్లన్నపై చర్యలు తీసుకోండి
` మండలి చైర్మన్‌,డీజీపీలకు కవిత ఫిర్యాదు
` ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న నాపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు
` ఆయనను వెంటనే సీఎం రేవంత్‌ అరెస్ట్‌ చేయించాలి
` వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తామని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):తనపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ‘’తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుషపదజాలంతో విమర్శలు చేస్తే వచ్చేవాళ్లు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా?ఏదైనా ఉంటే అంశం ప్రాతిపదికన మాట్లాడాలి తప్ప ఏం మాటలివి? దాదాపు ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నాం. ఏ రోజూ తీన్మార్‌ మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు.తెలంగాణ ప్రజలు పరుష పదజాలాన్ని సహించరు. మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారు. సామాన్యులపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఎందుకు?ఇది ప్రజాస్వామ్యం. దీనిలో అనేకమంది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి. జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది.. అందులో బీసీ ఉద్యమం ఒకటి. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. నాలాంటి వాళ్లను కోట్లాది మందిని తయారు చేస్తా. తక్షణమే తీన్మార్‌ మల్లన్నను సీఎం రేవంత్‌ అరెస్ట్‌ చేయించాలి. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తాం’’ అని కవిత అన్నారు.
డీజీపీకి కవిత ఫిర్యాదు
తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.