నటుడు కోట శ్రీనివాస్‌రావు కన్నుమూత
` ప్రముఖుల నివాళి
` ముగిసిన అంత్యక్రియలు
` ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరుల సంతాపం
హైదరాబాద్(జనంసాక్షి):ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించారు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో ప్రసాద్ మృతిచెందారు. కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచి నాటకాలంటే చాలా ఆసక్తి కనబడిరిచేవారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. కోట శ్రీనివాసరావుకు దర్శక నిర్మాత క్రాంతికుమార్ తొలి అవకాశం ఇచ్చారు. తన నటన, డైలాగ్ డెలివరీతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండిరచారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్‌బ్యాంకులో పనిచేశారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరిన ఆయన 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ ఆయన చివరి చిత్రం. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్నా, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు.
కోటను ఓవర్‌నైట్‌లో స్టార్‌ను చేసిన సినిమా ఏదంటే..
కెరీర్ మొదట్లో స్టేజీపై నాటకాలు ప్రదర్శించే ఈయన.. అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా విలనిజానికి కొత్త భాష్యాన్ని నేర్పాడు. అయితే ప్రారంభంలో సినిమాల అవకాశాల కోసం అందరిలాగే కోట శ్రీనివాసారావు కూడా కష్టపడేవాడు. ప్రాణం ఖరీదు, కుక్క అనే సినిమాల్లో చిన్ని చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి, వందేమాతరం సినిమాలో మంచి పాత్రను సంపాందించాడు. అయితే ఇవన్నీ కాకుండా తను సినీ పరిశ్రమలో పాతుకపోవడానికి కారణమైన సినిమా గురించి కోట ఓ సందర్భంలో చెప్పారు. నా కెరీర్‌కు కీలకమైన సినిమా ప్రతిఘటన . ఇది నా కెరీర్‌ను స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడిరది. వందేమాతరం సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ నాకు ఈ సినిమా గురించి చెప్పాడు. అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర ఇందులో కూడా చిన్నదే. పార్టీ అధ్యక్షుడుగా ఒకే సన్నివేశం రాశారు నా కోసం. సోదరి సోదరిమణులారా అని ప్రసగించాల్సిన సీన్ అది. ఇక ఆ డైలాగ్‌ను నా శైలిలో తెలంగాణ యాసలో చెప్పేసరికి టి.కృష్ణ అది బాగా నచ్చింది. అప్పుడు అక్కడ వున్న రచయిత పీఎల్ నారాయణకు చెప్పి నా మీద అదే శైలిలో మరో నాలుగైదు సీన్లు రాయమని చెప్పారు టి.కృష్ణ. రాత్రంతా కూర్చుని నా కోసం ఎనిమిది సన్నివేశాలు ప్రీపేర్ చేశారు. షూటింగ్ పూర్తయింది.. సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా తెచ్చిన పేరు గురించి అందిరికి తెలిసిందే. ఓవర్‌నైట్‌లో ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’ అని చెప్పుకొచ్చారు.
విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు: కేసీఆర్
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని అన్నారు. వారి మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. స్వర్గస్తులైన కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది.ఇందులో అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు చేశారు. తన విలక్షణ నటనతో తెలుగు సినీ ప్రియులకు చేరువైన కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధాకరమన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ‘’కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. తన అద్భుతమైన ప్రదర్శనలతో కొన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో ముందు ఉండటమే కాకుండా పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అని ప్రధాని మోదీ పోస్ట్ పెట్టారు.