నేను తప్పుచేయలేదు.. తప్పుకోను

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌
‘అల్లుడి’కి ఐదు రోజుల పోలీసు కస్టడీ
ముంబయి, మే 25 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ పదవి నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ముప్పేట దాడి తీవ్రతరమవడంతో ఎట్టకేలకు ఆయన స్పందించారు. శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ అరెస్టు నేపథ్యంలో శ్రీనివాసన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ తానేమీ తప్పు చేయలేదని, తప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కొందరు తనపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. బీసీసీఐ కఠిన నిబంధనలు తాను అనుసరిస్తున్నానని, ఫిక్సింగ్‌ వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.