నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం
` ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్
కాఠ్‌మాండూ(జనంసాక్షి): కాఠ్‌మండూ: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడిరది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణం చేశారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించారు. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి రికార్డు సృష్టించిన కర్కి.. ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగానూ అరుదైన ఘనత సాధించారు. నేపాల్ రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కొద్దిమంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమె.. ఆ వెంటనే కేబినెట్ సమావేశాన్ని నిర్వమించారు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలనిప్రతిపాదించి నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంక్షోభం ఎదుర్కొంటున్న నేపాల్ తాత్కాలిక సారథి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడిరది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా ఖరారయ్యారు. ఇందుకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలు, జన్ జడ్ ఉద్యమకారులు, ఆర్మీ, దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తాత్కాలిక ప్రధానిగా సుశీల ప్రమాణస్వీకారం చేయనున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడిరచింది. దీంతో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా నిలువనున్నారు.శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొద్దిమంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని సమాచారం.సుశీలా కర్కి (72).. జూన్ 7, 1952లో విరాట్‌నగర్‌లో జన్మించారు. తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి.. శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.2016లో నేపాల్ సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి.. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అభ్యసించిన కర్కి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలై.. అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా మారిన నేపాల్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కొత్త సారథిని ఎన్నుకునేందుకు జనరేషన్-జెడ్ ఉద్యమకారులు ప్రయత్నాలు చేశారు. రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి సహా కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ సీఈవో కుల్మన్ ఫీుషింగ్ పేర్లను పరిశించినప్పటికీ.. చివరకు మాజీ చీఫ్ జస్టిస్ వైపే మొగ్గు చూపారు.