నైరుతి ఆగమనంలో ఆలశ్యం
అల్పపీడనం పైనే ఆశలు..వర్షాభావంతో రైతాంగం నిరాశ
హైదరాబాద్, జూన్ 16 (జనంసాక్షి): హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అత్యంత బలహీనంగా ఉండడంతో నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలశ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూలత ఏర్పడడంతో చెదిరిన వాతావరణ శాఖ అధికారుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. వాతావరణశాఖ అంచనాలు ఫలించి మరో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు ప్రవేశానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్టేనని వాతావరణ శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
లోటు వర్షపాతం…
జూన్ నెల మొదటి వారం నుంచే నైౖరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు పరిగణిస్తుంటారు. ఈ నెల 1 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో 35.6 మిమీల వర్షం కురవాల్సిఉండగా ఇప్పటివరకూ కేవలం 10.9 మిమీలు మాత్రమే అంటే 25.3 మిమి తక్కువగా వర్షపాతం నమోదవడంతో ో రాష్ట్ర ప్రజలతో పాటు రైతాంగం నిరాశ చెందుతోంది. ప్రాంతాల వారీగా వర్షపాతం లోటు వివరాలు పరిశీలిస్తే… కోస్తాలో 57 శాతం, రాయలసీమలో 87 శాతం, తెలంగాణలో 70 శాతం ఉండడం గమనార్హం. రాష్ట్ర సరిహద్దుల వరకు నైరుతి విస్తరించిన నేపథ్యంలో ఎండలు తగ్గడం ప్రజలకు ఊరటనిస్తోంది. విదర్భ నుంచి తెలంగాణ, కోస్తాల మీదుగా అల్పపీడన ద్రోణి కూడా కొంచెం బలంగా ఉండడంతో తెలంగాణ, రాయలసీమ, దక్షిణకోస్తాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. శక్రవారం సాయంత్రం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరుజల్ల్లులు కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది. విస్తారంగా రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు వీలుగా బీహార్ దక్షిణ, చత్తీస్గఢ్ వరకు భూతల ద్రోణి ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం లోనూ, అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య భాగంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రుతువనాలు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతాయని అధికారులు తెలిపారు.