న్యూయార్క్‌లో తెలంగాణ కోసం ఎన్‌ఆర్‌ఐల భారీ లాంగ్‌ మార్చ్‌


లక్షన్నర మంది హాజరు .. హోరెత్తిన జై తెలంగాణ
న్యూయార్క్‌, ఆగస్టు27(జనంసాక్షి):
తెలంగాణ కోసం అమెరికా ఎన్‌ఆర్‌ఐలు న్యూయార్క్‌లో భారీ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సుమారు లక్షన్నర మంది తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నినాదాలతో ఎన్‌ఆర్‌ఐలు హోరెత్తించారు. తెలంగాణ సాధనకై జరుగుతున్న ఉద్యమంలో తాము సైతం భాగస్వామ్యులు కావడానికే ఈ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించినట్లు వారు తెలిపారుె. ఈ పెరేడ్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలను అమెరికా వాసులు తిలకించడానికి వీలుగా తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సాంప్రదాయలైన బతుకమ్మ, బోనాలు, పోచంపల్లి, గద్వాల్‌ చీరలు, పెంబర్తి కళాఖండాలు, నిర్మల్‌ చిత్రాలు ఈ లాంగ్‌మార్చ్‌లో ప్రదర్శనకు ఉంచారు. అలాగే ఇటీవలే మరణించిన కాపు రాజయ్య పెయింటింగ్స్‌కు సంబంధించిన అద్భుతమైన కళాఖండాలు, చారిత్రక కట్టడాలైన కాకతీయ తోరణం, రామప్ప గుడి, గోల్కొండ, చార్మినార్‌ తదితర చిత్రాలను సైతం ఈ మార్చ్‌లో ప్రదర్శించారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ అద్భుతమైన చారిత్రక సంపద తెలంగాణ సొంతమని, ప్రపంచంలోనే ఇంత గొప్ప చారిత్రక వారసత్వాన్ని కల్గిఉన్నందుకు తెలంగాణ వాసులుగా తామంతా గర్వపడుతున్నామన్నారు. ఈ మార్చ్‌కు తక్కువ సమయంలోనే ఇంత గొప్పగా సన్నద్దం కావడం, అయినప్పటికీ ఈ మార్చ్‌ విజయవంతం కావడం గొప్ప విషయమన్నారు. ఈ పరేడ్‌కు అను కూల స్పందన లభించినట్లు తెలిపారు. చారిత్రక కట్టడాల గురించి
శతాబ్దాల గురించి ప్రజలందరికీ తెలిసినా, అవి తెలంగాణలోనే పుట్టాయన్న విషయాన్ని తెలితయచేయడం తమకు గర్వకారణమన్నారు. న్యూయార్క్‌ వీధుల్లో మహిళలు, చిన్నారులు కలిసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో హోరెత్తించారు. ఇందులో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలందరూ ఉత్సాహవంతంగా పాల్గొన్నారు.హైద్రాబాదీ బిర్యాని ప్లకార్డును పట్టుకొన్న ఓ ఎన్‌ఆర్‌ఐ హైద్రాబాదీ ముస్లింఆహార్యంలో కన్పించారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిల్చిన ఈ లాంగ్‌మార్చ్‌ అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకొంది. తెలంగాణ సాధనకు జరిగే పోరాటాలకు తామంతా మద్దతిస్తామని, ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష తోనే ఈ లాంగ్‌మార్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు.