పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం

ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) :
దేశ అభివృద్ధికి పంచాయతీరాజ్‌ వ్యవస్థను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. పంచాయతీలను పరిపుష్టం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్టం చేయాలన్నది నినాదం కాకూడదని, నిజ జీవితంలో వాస్తవ రూపం దాల్చాలని తెలిపారు. పాలన వికేంద్రీకరణ కోసమే పంచాయతీలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించు కోవాలని.. తద్వారా ప్రజలందరికీ పాలనలో భాగస్వామ్యం కల్పించే అవకాశం కలిగించాలన్నారు. పంచాయతీ వ్యవస్థ పటిష్టపరిచేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వీలైనన్ని మార్గాల్లో చేయూతనిస్తుందని ప్రధాని హావిూ ఇచ్చారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. 11వ పంచవర్ష ప్రణాళిక కంటే ఈసారి అదనంగా పది రెట్ల నిధులు కేటాయించామన్నారు. 11వ ప్రణాళికా కాలంలో రూ.668 కోట్లు కేటాయిస్తే.. 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.6,437 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకువస్తేనే మంచి ఫలితాలు సాధించగలమన్నారు.