పంజరంలో చిలుక సీబీఐ

 కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహ
దర్యాప్తు సంస్థను బానిసత్వం విముక్తం చేయాలని ఆదేశం
లేదంటే స్వతంత్ర హోదా కల్పిస్తాం : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) :
బొగ్గు కుంభకోణంపై సీబీఐ చేస్తోన్న దర్యాప్తులో ‘చేయి’ పెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మొత్తింది. కేంద్ర ప్రభుత్వం మాట వింటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ తీరు పంజరంలో రామచిలుకల మారిందని వ్యాఖ్యానించింది. ఒకే రామచిలుక ఉంటే..దానికి రాజకీయ బాసులు పెరిగిపోయారని పేర్కొంది. ఇలాగే, రాజకీయ జోక్యం పెరుగుతూ ఉంటే సీబీఐ స్వతంత్ర ¬దాకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ    అధికారులను సీబీఐ సంప్రదించాల్సిన అవసరం లేదని.. అవసరమైతే వారిని ప్రశ్నించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. బొగ్గు కుంభకోణం వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. దర్యాప్తులో కేంద్ర మంత్రి, ఇతరులు జోక్యం చేసుకున్నారని సీబీఐ డైరక్టర్‌ రంజిత్‌ సిన్హా రెండ్రోజుల క్రితం దాఖలు చేసిన అఫిడవిట్‌పై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. అటార్నీ జనరల్‌, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవర్తతను తీవ్రంగా తప్పుబట్టింది. దర్యాప్తు సంస్థ పూర్తి స్వతంత్రంగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పని చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐని పక్షపాత రహితంగా ఉంచగలరా? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకవేళ సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించ లేకపోతే.. దర్యాప్తు సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేందుకు తామే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులతో సంప్రదించాల్సిన అవసరం సీబీఐ విధి కాది.. వాస్తవాలు వెలికితీసేందుకు అవసరమైతే వారిని ప్రశ్నించవచ్చని హితవు పలికింది. సీబీఐ దర్యాప్తులో న్యాయశాఖ మంత్రి అశ్వనీకుమార్‌ జోక్యంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. మంత్రి దర్యాప్తు నివేదిక కోరవచ్చు కానీ, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని పేర్కొంది. అయితే, సీబీఐ తరచూ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు ఎలా జరుపుతుందని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు నివేదిక చూసిన పీఎంఓ, బొగ్గు శాఖ కార్యదర్శులపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఆ అధికారులకు ఏమొచ్చిందని నిలదీసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర అయిన అటార్నీ జనరల్‌.. తన పాత్రపై వివరణ ఇచ్చుకున్నారు. న్యాయశాఖ మంత్రి సలహా మేరకు సీబీఐ అధికారులతో సమావేశం కావాల్సి వచ్చిందని తెలిపారు. కోల్‌గేట్‌లో సీబీఐ దర్యాప్తు నివేదికను తాను అడగలేదని, చూడలేదని ఉద్ఘాటించారు.