పక్కాగా ఎన్నికల కోడ్ అమలు
కోడ్ అమలు కోసం 33 బృందాల ఏర్పాటు
15వరకు ఓటర్ల నమోదుకు అవకాశం
నల్లగొండ,మార్చి13(జనంసాక్షి): పార్లమెంట్ ఎన్నికకు సైతం షెడ్యూల్ వెలువడి నేపథ్యంలో.. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్న ప్రతి అంశాన్ని తొలగిస్తున్నామని.. కోడ్ అమలు కోసం 33 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు చొప్పున 21 ప్లయింగ్ స్కాడ్ బృందాలు.. వీటితోపాటు వీడియో, స్టాటిస్టిక్, వ్యయం అంచనా బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు 1950 నంబరు ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 15,79,207 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 1990 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. ఓటరు నమోదుకు ఈ నెల 15వరకు అవకాశం ఉన్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని.. ఇప్పటికే ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్లు కూడా తమ తమ ఓట్లను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. ఇకపోతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని గౌరవ్ ఉప్పల్, వెల్లడించారు. ఈనెల 22న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌తోపాటు 26న జరిగే కౌంటింగ్‌కు సైతం ఏర్పాట్లు సిద్ధం చేశామని వివరించారు. వచ్చేనెల 11న జరగనున్న నల్లగొండ ఎంపీ ఎన్నిక పోలింగ్, మే 23న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం కూడా పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. రెండు ఎన్నికల ఓట్ల లెక్కింపునూ నల్లగొండ శివార్లలోని దుప్పలపల్లి వేర్ హౌజింగ్ గోదాములలో నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడిజిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికతోపాటు నల్లగొండ పార్లమెంట్ ఎన్నికను సైతం పక్కాగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మొత్తం 20,888మంది ఓటర్లున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఈ నెల22న, కౌంటింగ్ 26న జరగనున్న నేపథ్యంలో ఇందుకోసం 2వేల మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లోనూ వీడియో రికార్డ్ చేయడంతోపాటు మైక్రో అబ్జర్వర్లను సైతం నియమిస్తున్నామని చెప్పారు.