‘పచ్చ’ పైత్యం మనకెందుకు..?

1

ఆటోలు, స్కూల్‌ బస్సులకు టిడిపి జెండా రంగు

1994లో ఎన్టీఆర్‌ హయాంలో జీఓ జారీ

తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాపార్టీ జెండా కలర్‌ ఎందుకు..?

తెలంగాణ రంగు వేసేందుకు టిసర్కార్‌ చర్యలు తీసుకోవాలి

అన్నింటా ఆదిపైత్యం

ఆటోలకున్న పసుపు కలర్‌పై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

 

”సమైక్య పాలనలో మన భాష.. యాస.. సంస్కృతులపై దాడి జరిగింది. తమ భాష, యాసలే ప్రామాణికమని ప్రచారం చేసుకున్నారు. అలాగే.. పచ్చపార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఆటోలు, ట్యాక్సీలకు ఉన్న రంగులను తొలగించి తమ పార్టీ రంగును పూసి ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. అన్నింటా.. తమదే ఉండాలన్న ఈ ఆదిపైత్యంపై తెలంగాణ సర్కారు స్పందించాలి.”

 

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : ఆంధ్రోళ్ల పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఆడిందే ఆట పాడిందే పాట. వారు ఏం చేసినా.. ఏం చెప్పినా.. అది వేదమే. అడిగితే.. అణగదొక్కుడే. అందుకు బోలెడన్ని ఉదంతాలు ఇప్పటికీ తెలంగాణలో కళ్లముందు కదలాడుతున్నాయి. అందులో ఒకటి.. తెలంగాణలో ఉన్న ఆటోలు, స్కూల్‌ బస్సులకు ఉన్న ఎరుపు రంగును మార్చి ఆ స్థానంలో వాటికి పసుపు రంగు పట్టించారు. ఇది టిడిపి జెండా కలర్‌. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994లో ఏకంగా జీఓ తీసి మరీ ఈ రంగు వేయించారు. తద్వారా తెలుగుదేశం పార్టీకి మంచి ప్రచారం తెచ్చిపెట్టారు. ఇదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. ఆంధ్రా పార్టీ అయిన టిడిపి జెండా కలర్‌, ఆ పసుపు పైత్యం తెలంగాణకు ఇంకా అవసరమా..? అంటూ.. ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.

 

తెలంగాణ ఆటోలకు టిడిపి కలర్‌ ఎందుకు…?

తెలంగాణలోని ఆటోలు, స్కూల్‌ బస్సులకు ఉన్న ఎరుపు రంగును తొలగించి ఆ స్థానంలో పసుపు రంగును వేయాలని అప్పటి ముఖ్యమంత్రి తారకరామారావు భావించారు. పసుపు రంగునే ఎందుకు ఎంచుకున్నారంటే.. అది తన పార్టీ అయిన టిడిపి జెండా కలర్‌. దానికి గుర్తుగా పసుపు రంగును వేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఏకంగా 1994లో జీఓనే జారీ చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఆటోలు, స్కూల్‌ బస్సులపై పసుపు రంగులో పెయింటింగ్‌ చేస్తున్నారు. అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ జెండా కలర్‌ను వాహనాలపై వేయించాలని ఆలోచించడం, తద్వారా తమ పార్టీకి ప్రచారం కల్పించుకోవడం ఆంధ్రోళ్లకే దక్కుతుంది. తెలంగాణను వారు తొక్కిపెట్టని చోటంటూ, రంగమంటూ లేదని దీనిద్వారా స్పష్టమౌతోంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా వారు నిర్ణయించిన రంగు, ఆంధ్రా పార్టీల జెండా రంగు ఇంకా తెలంగాణ ఆటోలపై, స్కూల్‌ బస్సులపై ఎందుకుండాలని తెలంగాణ ప్రజలు గళమెత్తాలి. ముఖ్యంగా ఆటోవాలాలు ఈ విషయాన్ని గుర్తించాలి.

 

సమైక్య పాలకుల జీఓలు, చట్టాలను మార్చాల్సిందే…

తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్య పాలకులు చేసిన జీఓలు, చట్టాలను తెలంగాణ ప్రభుత్వం సమూలంగా మార్చాలి. వాటి స్థానే తెలంగాణకు ఫలితమిచ్చే.. తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా జీఓలు, చట్టాలు రూపొందించాలి. అప్పుడే ఆంధ్రోళ్ల పాపాలు, సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలకు తలపెట్టిన కుట్రల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి చేసినట్లు అవుతుందని పలువురు తెలంగాణ వాదులు, ఆటో యూనియన్‌ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని ఆటోలు, స్కూల్‌ బస్సులపై ప్రస్తుతం వాడుతున్న పసుపు రంగును వెంటనే మార్చి తెలంగాణ సూచనగా, గుర్తుగా వేరొక రంగును వేసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు. ఆంధ్రోళ్ల ఆనవాళ్లు, ఆ పాలకుల విధానాలు, జీఓలు, చట్టాలు ఇక నుంచి తెలంగాణలో కనిపించకుండా సమూల మార్చులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేయాలని సూచిస్తున్నారు. కరుడుగట్టిన సమైక్యవాది, ఇప్పటికీ తెలంగాణపై వివక్ష చూపుతున్న చంద్రబాబునాయుడు పార్టీ అయిన టిడిపి జెండా రంగుతో ఆటోలు, స్కూల్‌ బస్సులు తెలంగాణ రాష్ట్రంలో తిరగకూడదని తెలంగాణవాదులు కోరుతున్నారు.

 

కొత్త ఆటోలకైనా పసుపు కలర్‌ మార్చాలి…

తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణను ప్రతిబింబించే కలర్‌లనే తెలంగాణ వాహనాలపై ఉపయోగించాలి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సూచకంగా ఆటోలు, స్కూల్‌ బస్సులపై ప్రస్తుతం ఉన్న పసుపురంగును తొలగించడంతోపాటు కొత్తగా వచ్చే ఆటోలు, స్కూల్‌ బస్సులపై తెలంగాణను గుర్తు చేసే విధంగా రంగులు మార్చాలని, అందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తీసుకుంటుందని ఆశిద్దాం.. ఆకాంక్షిద్దాం. అలాగే.. రంగు మార్చే వాటికి ప్రభుత్వం రాయితీలివ్వాలి. ఫిట్‌నెస్‌ కోసం వచ్చే ఆటోలకు రంగు మార్చాలి. తెలంగాణ అన్నింటా ఆదిపైత్యాన్ని అంతం చేసి తద్వారా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తేవాలని తెలంగాణ సర్కారును కోరుకుందాం.