పటిష్ట పోలీసు బందోబస్త్ నడుమ గణేష్ నవరాత్రి ఉత్సవాలు
మండపాల వద్ద నిబంధనలు పాటించాలి
జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.సోమవారం స్థానిక పబ్లిక్ క్లబ్ నందు సూర్యాపేట పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలన్నారు.మండపాల వద్ద డిజెలకు అనుమతి లేదని చెప్పారు.ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని అన్నారు.సోదరభావం అనేది తెలంగాణ రక్తంలోనే ఉందన్నారు.నవరాత్రి ఉత్సవాల సమయంలో మద్యానికి దూరంగా వుండాలని, నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు, బెల్టు షాపులు కూడ మూసి వేస్తామని పేర్కొన్నారు.గణేష్ మండపాలు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయవద్దని, వాహనాలకు దారి వదలాలని కోరారు.నిమజ్జనం జరిగే సమయంలో పోలీస్ , రెవెన్యూ, మున్సిపల్ శాఖల సూచనలు పాటించాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో శాంతియుతంగా ఆదిదేవుని ఉత్సవాలు నిర్వహించుకోవాలని, గణేష్ పూజలు అన్నదమ్ముల మాదిరిగా ప్రజలందరు కలిసిమెలిసి జరుపుకోవాలని కోరారు.పోలీసు వారి సూచనలు పాటించాలని అన్నారు.సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తామని, ప్రజలంతా సహాయకరించాలని కోరారు.ఈ సమావేశంలో పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్ఐ క్రాంతి కుమార్, తహశీల్దార్ వెంకన్న, ఫిషరీస్ అధికారి ఉపేందర్, శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.