పడుతుల కళ్లలో బతుకమ్మ వెలుగులు..

రాష్ట్రంలో దసరా, దీపావళి సందడి మొదలైంది. మరో ఐదు రోజులకు ప్రారంభమయ్యే  శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయ. ఇదే సమయంలో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ ఏర్పాట్లు కూడా ఊపందుకున్నాయి. ఈ పండుగ  ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే పెళ్లయన ప్రతి స్త్రీకి తన పుట్టిల్లు జ్ఞాపకం వస్తుంది. అమ్మాయిల చిన్నతనం నుంచి ఎన్నో జ్ఞాపకాలు బతకమ్మ పండుగతో ముడిపడి ఉంటాయి. అందుకే పెళ్లయి మెట్టినింటికి వెళ్లినా బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్లాలని ఆశపడని పడతి ఉందంటే అతిశయోక్తికాదు.  అయితే కాలంతో పాటు బతుకమ్మ పండగ కూడా  కళ తప్పింది.  ఏదో జరుపుకుంటున్నారంటే జరుపుకుంటున్నారనేలా ఉండేది నిన్న మొన్నటి వరకు పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత బతుకమ్మ పండగకు పోయిన  కళ తిరిగి వచ్చింది. పల్లె పల్లెలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలే కాదు…పట్టణాల్లో కూడా బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమే ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా బతకమ్మను పురస్కరించకుని ఆడపడుచులకు చిరు కానుకగా చీరలు పంపిణీ చేస్తోంది. తొలి ఏడాది పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాసిరకం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టారు. పలు చోట్ల చీరలు దగ్ధం చేశారు. దీంతో ప్రభుత్వం ఈ చీరల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మళ్లీ అలాంటి విమర్శలకు తావు లేకుండా పగడ్బందీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఏడాది చీరల పంపిణీ కార్యక్రమంగా సోమవారం మొదలైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు స్వయంగా చీరలు పంచుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక అంశంలో విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి.  ఈ ఏడాది చీరెలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. మరి ఈ ఏడాది చీరలు ఎలా ఉంటాయన్నది ముందు ముందు  మహిళలే చెప్పాల్సివుంది. బతుకమ్మ చీరల పంపిణీలో ఇది ఒక పార్శ్వం మాత్రమే.
బతుకమ్మ చీరెలు చూసి పడతుల కళ్లు ఎలా మెరుస్తాయో..వాటిని నేసిన నేతగాళ్ల కళ్లు కూడా అలాగే మెరుస్తాయి. ఒకరిది సంబరమైతే ఇంకొకరిది ఆకలి తీరిన సంతోషం. అ డబ్బుతోనే వారికి ఏడాదంతా గడవక పోయినా ..  వీటి ద్వారా వచ్చే ఆదాయం వారి బతుకులకు ఎంతో కొంత భరోసా కల్పిస్తోంది. నిత్యం 12 గంటలపాటు సాంచాల మధ్య నిలబడి వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే  ఒక నేత కార్మికునికి వారానికి నాలుగు వేల రూపాయాల   కూలి వస్తుంది. అంటే నెలకు పదహారు వేల రూపాయలు.  ఇదే పనికి గతంలో నెలకు రూ.8 వేలకు మించి కూలి రాకపోయేది.  కార్మికులకు చేయూతనందించటం కోసం ప్రభుత్వం ఈ చీరల తయారీని తెలంగాణ  నేతన్నలకు అప్పగించింది. దీంతో వేలాది మంది  నేత కార్మికులకు చేతినిండా పనిదొరికింది. కూలి రెట్టింపు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా చీరలు తయారుచేశారు. దాదాపు వంద రంగుల్లో ఈ సారి బతుకమ్మ చీరెలు పడుతులను పలకిరిస్తున్నాయి. ప్రతి మగ్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేతన్నలకు మరోమారు భరోసా ఇవ్వటం హర్షణీయం. మొత్తం రూ.313 కోట్లతో 100 రకాల చీరల్ని సిద్ధం చేసింది ప్రభుత్వం. . మొత్తం 16000 కుటుంబాలు, 26000 మర మగ్గాల్ని వాడి… ఈ చీరల్ని తయారుచేశాయి. 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగులు కలిపి… 100 వరైటీల్లో చీరలు రెడీ అయ్యాయి.  బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.715 కోట్లు ఖర్చు చేసింది.గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు చీరల్ని పంచుతాయి. ఈసారి చీరల క్వాలిటీ
పెంచినట్టు చెబుతున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న సిద్దాంతాన్ని తూ.చ తప్పకుండా  అమలు చేసే అతి కొద్దిమందిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరని పేరు. మొదటి రెండు సంవత్సరాలు బతుకమ్మ చీరల రచ్చ అంతా ఇంతా కాదు. ఈ చీరల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. నాణ్యత బాగోలేదని తెలంగాణ మహిళలు ప్రభుత్వాన్ని ఉద్దేశించి నానా బూతులు తిట్టటమే కాదు.. కొన్ని చోట్ల కాల్చేశారు. ఇలాంటివి వరుస పెట్టి చోటు చేసుకున్నప్పుడు.. మనకెందుకులేరా రిస్క్‌ అన్నట్లు సదరు పథకానికి ప్రాధాన్యత తగ్గించేస్తుంటారు. అలా చేస్తే ఆయన కేసీఆర్‌ కారు కదా? అందుకే ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా పంపిణీ చేసే చీరల కోసం భారీ కసరత్తు చేశారు. మరి ఈసారి విపక్షాలు ఏమంటాయో చూడాలి!!