పత్తి విత్తనాలకే రైతుల మొగ్గు

 ఖమ్మం,మే26(జ‌నం సాక్షి): మరో పక్షంరోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 22,251 కింటాళ్ల విత్తనాలు అవసరం అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. జిల్లాలో పత్తి భారీ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే విత్తనాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న ఆరునెలల కాలానికి అవసరమైన మేర ఎరువులకు సంబంధించిన ఇండెంట్‌ సైతం తయారుచేసిన అధికారులు మార్క్‌ఫెడ్‌ అధికారులకు పంపించారు. రైతులకు సరిపడా యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు సైతం ఆయా గోదాంలలో నిల్వ ఉంచారు. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నిరకాల విత్తనాలు కలిపి 33వేల క్వింటాళ్లు అవసరం అయ్యే అవకాశం ఉండగా, ఇప్పటికే జిల్లా టీ సీడ్స్‌ కార్పొరేషన్‌ గోదాంలలో 18,174 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.వేరుశనగ 35 క్వింటాళ్లు, వరి వివిధ రకాలు కలిపి 7,200 క్వింటాళ్లు, కంది 579 క్వింటాళ్లు, పెసర 905 క్వింటాళ్లు, మినుములు 30 క్వింటాళ్లు, మెక్కజొన్న 175 క్వింటాళ్లు అవసరం ఉంటుందని అంచన వేశారు. వీటితో పాటు భూమిలో సారాన్ని పెంచే విత్తనాలు (పచ్చిరొట్ట), పిల్లిపెసర, జనుము కూడా వేయనున్నారు.   ఇప్పటికే జిల్లా కేంద్రంలో సుమారు 10,970 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. రైతుల అవసరాన్ని బట్టి రెండవ విడతలో మరికొన్ని విత్తనాలు సైతం పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు  అధికారులు పేర్కొంటున్నారు. విత్తనాల కోసం పట్టణాలు, నగర కేంద్రానికి రాకుండా వారివారి గ్రామాల్లో కొనుగోలు చేసుకునే విధంగా ప్రణాళికను రూపొందించారు.