పదవికే మచ్చ తెస్తున్న గవర్నర్‌

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఈసీఎల్‌ నరసింహన్‌ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అప్పుడు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ, పెట్టుబడీదారుల డబ్బు సంచులతో నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాలపై ఈ మాజీ పోలీసు అధికారి కాంగ్రెస్‌ అధిష్టానానికి పలు నివేదికలిచ్చి తన సీటును పదిలపరుచుకునే ప్రయత్నాలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం జరుపుతున్న తరుణంలో గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరించి ఒక ప్రాంతానికే వత్తాసు పలికారని అనేక ఆరోపణలు గుప్పుమన్నాయి. అధికారపార్టీ నేతలు కూడా గవర్నర్‌ను విడిచి పెట్టకుండా ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలపై తక్కువగా మాట్లాడే నరసింహన్‌ జాతీయ మీడియా ఎదుట మాత్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి అనేక సందర్భాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉంటూ స్థానిక పరిస్థితులపై అనేక నివేదికలు ఇచ్చారు. అడ్డదారిలో అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. రాష్ట్రంలో ఎలాగైనా రాష్ట్రపతి పాలన తేవాలని ఆయన సాగించని కుతంత్రాలు లేవు. రాష్ట్రపతి పాలన ముసుగులో సైన్యాన్ని రంగంలోకి దించి ఉద్యమాన్ని అణచివేయాలని, ఉద్యమకారులపై దండయాత్ర సాగించాలని పోలీసు మాజీ బాస్‌ కుట్ర పన్నారు. పాలనలో తన ముద్ర కనిపించాలని, ప్రభుత్వం నామమాత్రమేనని చాటి చెప్పాలని నానా యత్నాలు చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తూ ఇంటెలిజెన్స్‌ నివేదికలు పేరుతో కాంగ్రెస్‌ అధిష్టానానికి తప్పుడు లేఖలు పంపి గందరగోళం సృష్టించారు. ఇదైంతా ఒక ఎత్తయితే గవర్నర్‌ అధికార పరిధి, ఆయనకున్న విశేషాధికారాలు, క్రియాశీలంగా వ్యవహరించాల్సిన సమయం ఇలా అన్ని విస్మరించి పనిచేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన నిర్ణయమే కీలకం. పార్లమెంట్‌లో చేసే బిల్లులు, చట్టాలు అనుమితించాలన్నా, తిప్పిపంపాలన్న ఆయనకు విశేష అధికారులుంటాయి. గతంలో ఇలా కేఆర్‌ నారాయణన్‌, ఏపీజే అబ్దుల్‌కాలాం వ్యవహరించి ప్రథమ పౌరుడి స్థానం రబ్బర్‌స్టాంప్‌ కాదని తేల్చిచెప్పారు. కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయో రాష్ట్రంలో గవర్నర్‌కు అవే అధికారాలుంటాయి. ప్రత్యక్షంగా గవర్నర్‌లను రాష్ట్రపతే నియమిస్తున్నప్పటికీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వారికి అనుకూలంగా ఉన్న వారికే రబ్బర్‌స్టాంప్‌ పోస్టు దక్కుతుంది. వారు రాజ్‌భవన్‌లో రాజభోగాలు అనుభవిస్తూ సర్కారు పంపే పత్రాలపై సంతకాలు చేసి తిప్పి పంపడం మినహా పెద్దగా చేయడానికి పని ఉండదనే చెప్పుకోకతప్పదు. గతంలో ఏ రాష్ట్ర గవర్నర్‌ కూడా ఢిల్లీలో అధికార పార్టీ అధ్యక్షులతో బాహాటంగా భేటీ అయిన సందర్భాలు లేవు. కానీ నరసింహన్‌ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనభీ ఆజాద్‌ రాష్ట్ర గవర్నర్‌ కంటే ఎందులో ఎక్కువో ఆయనే చెప్పాలి. రాష్ట్ర ప్రథమ పౌరుడికంటే ఒక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏమాత్రం ఎక్కువకాకున్నా ఆయనతో భేటీ అయి నరసింహన్‌ గవర్నర్‌ పదవికే తీరని మచ్చ తెచ్చారు. ఇలా ఆయన వ్యవహరించడం ఒక్కసారి కాదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా వ్యవహరించారు. యూపీఏ చైర్‌ పర్సన్‌గా ఉన్న ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఉన్న అధికారమేమిటని ఆమెతో గవర్నర్‌ భేటీ అయ్యారో ఆయనే చెప్పాలి. తెలంగాణకు వ్యతిరేక నివేదికలే ఇవ్వడం లక్ష్యంగా గవర్నర్‌ అధికార పరిధిని విస్మరించి రాజకీయ భేటీలు కొనసాగిస్తున్నారని ఈ ప్రాంతానికి చెందిన నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. రెండు రోజుల క్రితం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కాంగ్రెస్‌ అధిష్టానానికి ఎందుకు తొత్తుగా మారావని నిలదీశారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ఢిల్లీలో మీడియాకు వివరణ ఇచ్చిన గవర్నర్‌ ప్రజాజీవితంలో ఉన్నవారిపై ఆరోపణలు రావడం సహజమంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో కించిత్‌ తప్పు చేసిన భావన కనిపించలేదు. తనను రెండోసారి గవర్నర్‌గా నియమించిన కాంగ్రెస్‌ అధిష్టానానికి వీరవిధేయుడిగా ఉండాలని, ప్రభుభక్తిని చాటుకోవాలనే ఆరాటం తప్ప ఆయనలో ఎలాంటి స్పందనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తల్తెతితే గవర్నర్‌ పాత్ర అత్యంత కీలకం. రాష్ట్రపతి ప్రతినిధిగా ఆయన రాష్ట్రంలో పరిపాలన సాగించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడే వరకు పాలనలో ఎలాంటి లోటులేకుండా చూసుకోవాలి. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి తలెత్తితే ఇప్పుడున్న గవర్నర్‌ పాలనలో తన సొంత ముద్ర చాటాలనేది ఆయన తాపత్రయం. రాజ్యంగ బద్ధంగా పదవిలో కూర్చున్న రాష్ట్ర ప్రథమ పౌరుడు రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం పెరిగేలా వ్యవహరించాలే తప్ప నరసింహన్‌లా ఢిల్లీలో చక్కర్లు కొట్టి పదవి గౌరవాన్ని గంగలో కలపొద్దు. దీనిని ప్రజాస్వామవాదులంతా ముక్తకంఠంతో కండిస్తున్నా గవర్నర్‌ తీరులో మార్పు రాకపోవడం ఆక్షేపణీయం.