పది జిల్లాల తెలంగాణే కావాలి

29న ప్రజాకోర్టు
4, 5 తేదీల్లో జాతీయ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం
కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) :
పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. బుధవారం నగరంలోని టీ జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ఈనెల 29న మసాబ్‌టాంక్‌ వద్ద ప్రజా కోర్టు నిర్వహించనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో జాతీయ స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఢల్లీిలో నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెసేతర పార్టీలన్నింటిని సమావేశానికి ఆహ్వానిస్తామని అన్నారు. ముఖ్యంగా తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కోదండరామ్‌ అన్నారు. డిసెంబరు 9, 2009 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ అధిష్టానం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం వెయ్యి మంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానం చేసినా కేంద్రం కాంగ్రెస్‌ అధిష్టానం గుర్తించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే జాతీయ స్థాయిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణపై ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. ఎంతగా హడావుడి చేసినా తెలంగాణ ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పి తీరుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని అన్నారు. ప్యాకేజీలు తమకు వద్దని.. తెలంగాణయే కావాలని కోదండరాం అన్నారు. ప్యాకేజీ, చలో అసెంబ్లీ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రజాకోర్టు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్యాకేజీలను తిరస్కరిస్తున్నారన్నారు. తెలంగాణపై మాట తప్పితే కాంగ్రెస్‌ పార్టీని ఎక్కడికక్కడ ఎదుర్కొంటామని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు పదవులకు రాజీనామాలు ఇవ్వాల్సిందే తప్ప సమావేశాలతో ఒరిగేదేమీ లేదన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలకు తెలంగాణ కావాలని కోదండరామ్‌ డిమాండు చేశారు.