పది జిల్లాల తెలంగాణ కావాలి

ఒక రోజు వేతనం తెలంగాణ అమరవీరులకు
పదో పీఆర్సీ అమలుకు దేవీప్రసాద్‌ డిమాండ్‌
హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) :
పది జిల్లాల తెలంగాణే కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని పదో పీఆర్సీ చైర్మన్‌ కార్యాలయంలో ఆయన చైర్మన్‌ సంఘం నేతలతో చైర్మన్‌ పీకే అగర్వాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పదో పీఆర్సీకి విజ్ఞప్తులు సమర్పించే గడువు రెండు రోజుల్లో ముగుస్తుందనగా టీఎన్‌జీవోలు చైర్మన్‌ను కలిశారు. కనీస వేతనం 15 వేలకు తగ్గకూడదని, ఫిట్మెంట్‌ 70 శాతం ఉండాలనే డిమాండ్ల పత్రం అందజేశారు. అనంతరం దేవీప్రసాద్‌ మాట్లాడుతూ, తెలంగాణపై కేంద్రం రోజుకో లీకులిస్తూ ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్యాకేజీ, రాయల తెలంగాణ, హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం అంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగులు సత్తా ఏంటో కేంద్రానికి ఇది వరకే తెలుసని, మళ్లీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బొందపెట్టి తీరుతారని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పదో పీఆర్సీ జూలై 1 నుంచి అమలు కావాల్సిందేనని, ఆలస్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.