పన్నుల ఎగవేత అభివృద్ధికి విఘాతం

1

-అరుణ్‌ జైట్లీ

ముంబయి,ఆగస్టు 20(జనంసాక్షి): బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి సక్రమంగా చెల్లించడం తప్పనిసరి చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రజలకు హితవు పలికారు.  తక్కువ పన్ను విధానాలు కావాలంటే పన్నులు ఎగ్గొట్టవద్దని హితవు చేశారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో జైట్లీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక శాతం ప్రజలు చక్కగా పన్నులను చెల్లిస్తుంటే ప్రభుత్వం పన్నులు తగ్గించే విధానం గురించి తప్పకుండా ఆలోచిస్తుందని జైట్లీ అన్నారు. ఎక్కువ మంది పన్ను ఎగవేత దారులు ఉండి, తక్కువ పన్ను విధానం ఉంటే.. ఒకదానికొకటి సరిపోవన్నారు. పన్ను ఎగవేత దారులు పెరుగుతుంటే పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుందన్నారు.7-18 శాతం జీఎస్‌టీపై మాట్లాడుతూ వ్యాపారవర్గాలు, పరిశ్రమలు చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా చెల్లించాలని జైట్లీ పేర్కొన్నారు. జీఎస్‌టీ వల్ల తప్పకుండా పన్ను రేట్లు పరిమితంగా ఉంటాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్లడానికి ఇదొక్కటే మార్గమన్నారు. నిర్మాణ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు ఉంటాయని.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కేవలం నినాదం మాత్రమే కాదని జైట్లీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ శక్తిమంతమైనదని.. అందుకే గ్లోబల్‌ ఎకానవిూ వెనుక బడుతున్నప్పటికీ భారత్‌ నిలదొక్కుకోగలుగుతోందని పేర్కొన్నారు.