పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యం కలెక్టర్ సౌరభ్‌గౌర్
శ్రీకాకుళం, జూలై 23: మెరుగైన పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలను శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ వార్డు అయిన ఆదివారంపేటలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీధులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం పాటించి పురపాలక సిబ్బందికి సహకరించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు బూట్లు, గ్లౌజులు, సబ్బులు, నూనె, యూనిఫాంతో పాటు ఇతర సౌకర్యాలు అందజేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. కార్మికులతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను, చదువు మధ్యలో ఆపేసి ఈ పని చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఆరోగ్య అధికారి ధవళ భాస్కరరావు, డీఈఈ డి.సుగుణాకరరావు, తహశిల్దారు సి.హెచ్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.