పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకు

నిరుద్యోగులను మోసం చేసవారిపై చర్యలు ఉండవా
నాయకులకు సవాల్‌ విసురుతున్న బర్రెలక్క
ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు
కొల్లాపూర్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) ఈసారి ఎన్నికల్లో నాగర్‌ర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంపై
రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నిరుద్యోగి కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పోటీ చేయడంతో పాటు, ఆమె ప్రచార శైలి కూడా ఆకట్టుకుంటోంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ఆమెకు మద్దతుగా ప్రచారం  నిర్వహించడం విశేషం. మాజీమంత్రి
జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ నుంచి పోటీ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి మరోమారు
రంగంలో ఉన్నారు. వీరికి బర్రెలక్క చెమటలు పట్టిస్తున్నారు. ఆమె.. నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల బరిలో నిలిచింది. పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని రోజూ వందలకొద్దీ బెదిరింపులు వస్తున్నా ధైర్యంతో ముందుకెళ్తున్నది.  తన తమ్ముడిపై దాడి జరిగినా వెనక్కి తగ్గేది లేదని, పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. పోలింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ శిరీషకు నిరుద్యోగుల తో పాటు ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. బర్రెలక్కకు ఓటు వేయాలని యూట్యూబర్లు, సోషల్‌ విూడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లు కోరుతున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ఆమె ఎవరి ఓట్లు చీలుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష(26) తల్లి రోజువారీ కూలీ. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. తండ్రి వీళ్లకు దూరంగా ఉంటున్నాడు. శిరీష ఓపెన్‌ డిగ్రీ చేస్తూనే కుటుంబానికి ఆసరాగా ఉండాలని నాలుగు బర్రెలు కొనుక్కుంది. వాటిని మేపుతూ వీడియోలు చేసి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసేది. హలో ఫ్రెండ్స్‌.. ఎంత చదివినా ఉద్యోగాలు వస్తలేవ్‌. అందుకే నాలుగు బర్లను కొనుక్కున్న.. పాలమ్మితే రోజుకు మూడు వందలు ఎక్కడికిపోవు’ అంటూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఆమె చేసిన వీడియో సోషల్‌ విూడియాలో  వైరల్‌ అయింది. ఆ తర్వాత వివిధ సమస్యలపై వీడియోలు చేసి విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుని బర్రెలక్కగా ఫేమస్‌ అయింది. డిగ్రీ పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో బర్రెలను అమ్ముకున్న శిరీష.. హైదరాబాద్‌?కు వెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. నోటిఫికేషన్‌ పడిన ప్రతి పోస్టుకూ అప్లయ్‌?చేసింది. అయితే క్వశ్చన్‌ పేపర్ల లీకేజీలు, పరీక్షల వాయిదాలతో విసిగిపోయి తిరిగి ఊరికి వచ్చేసింది.  రాని సర్కారీ నౌకరి కోసం జీవితాలను ఎందుకు బలి చేసుకోవాలని ప్రశ్నించే శిరీష.. అసెంబ్లీ ఎన్నికలే సరైన వేదిక అని నిర్ణయించుకుని, కొల్లాపూర్‌ నుంచి నామినేషన్‌ వేసింది. మొన్నటి దాకా తమాషాకు వీడియోలు చేస్తుందనుకున్న అమ్మాయి.. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలవడం, బెదిరింపులకు లొంగకుండా హేమాహేవిూలతో తలపడ్తుండడంతో ఇప్పుడు రాష్ట్రమంతా బర్రెలక్క వైపు చూస్తోంది.  గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, విద్య, వైద్య రంగాల దుస్థితి తదితర అంశాలను ప్రస్తావిస్తోంది. ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా ప్రకటించింది. కాగా, బెదిరింపులు, దాడుల నేపథ్యంలో బర్రెలక్కకు సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు ఆదేశించడంతో ఆమె పేరు మరోమారు వార్తల్లోకి ఎక్కింది. పరీక్షలు సక్కగా రాయకపోతే ఫెయిల్‌ చేస్తరు. అసలు పరీక్షలే సక్కగా పెట్టలేని ప్రభుత్వాలను ఏం చేయాలని ఆమె తన ప్రచారంలో ప్రజలకు వేస్తున్న ప్రశ్న ఆలోచించే దిగా ఉంది.తనకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నదని శిరీష తెలిపారు. నా దగ్గర డబ్బు లేదు. అందుకే చాలామంది చందాలు ఇస్తున్నారు. నేను పైసలు పంచను. మందు పొయ్యను. కానీ జనాలు వచ్చి, నేను చెప్పింది శ్రద్ధగా వింటున్నారు. ’నువ్వు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే’ అని అంటున్నారు. అది చాలు తను పోరాటానికి మద్దతు అంటున్నారు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగుల సమస్య. మా నిరుద్యోగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల సమస్య ఇది. వాళ్ల ఇంటి నుంచే పోరాటం మొదలు కావాలని పిలుపునిచ్చారు. తాను పోటీ చేస్తే, వివిధ పార్టీల లీడర్లు ఎందుకంత భయపడు తున్నారని శిరీష ప్రశ్నించారు. పేదలకు మంచి చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నన్ను బెదిరించిన ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఎన్నికల తర్వాత వెల్లడిస్తాను. నన్ను
చంపినా వెనకడుగు వేయను. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు అందరితో కలిసి పోరాడుతాను
అంటూ తన ధృఢ సంకల్పాన్ని ప్రకటించారు. ఇకపోతే శిరీష పోటీ చేయడంతో రాజకీయ పార్టీలకు మింగుడు పడటం లేదన్నారు. పేదరికంతో ఉన్నా.. ప్రజాస్వామ్య వ్యవస్థల విూద పెను ప్రభావం చూపవచ్చని ముక్కుపచ్చలారని బర్రెలక్క నిరూపించింది. దశాబ్దాల అనుభవాల దొంతరపొత్తు చెప్పే బీసీ నాయకులు శిరీషను చూసి సిగ్గు పడాలి. బీసీల రాజ్యాధికారం చందాల దందాల కాడనే ఆగిపోతే…వారి నాయకులు చెల్లని రూపాయి అవుతారు.  ప్రజాస్వామ్య హక్కును బర్రెలక్క తన లక్కుగా మార్చుకుంది. కోట్ల డబ్బుతో  గెలుద్దాం అనుకున్న నాయకులను గడగడలాడిస్తున్నది. వ్యాపారం, రాజకీయం  కలిసిపోయి రాజకీయాలను ధనస్వామ్యంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో శిరీషను అందరూ కలిసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.