పర్లపల్లిలో ప్రజా విజయం
కాలకూట విషాన్ని విరజిమ్మిన హరిత బయోటెక్
మూసేయాలని పీసీబీ ఆదేశం
కరీంనగర, జూలై 9 (జనంసాక్షి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లిలోని హరిత బయో ప్రాడక్ట్స్ ప్రాజెక్టును మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను అదేశించింది. సదరు ప్రాజెక్టును వెంటనే మూసివే యాలని పర్లపల్లి గ్రామస్తులు కొన్ని రోజుల కిందట పౌర హక్కుల సంఘం నాయకత్వంలో ఉద్యమించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సోమవారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. దీనిపై జరిగిన వాదోపవాదాలకు పీసీబీ మెంబర్ సెక్రెటరీ జయచంద్ర, ఆర్డీఓ సంధ్యారాణి, పీసీబీ ఇంజినీర్ శంకర్ నాయక్, టెక్నికల్ స్టాఫ్, గ్రామస్తులు, తెలంగాణ భూమి రక్షణ సంఘం, నాయకులు హాజరై తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాళ్లు సదరు కంపెనీ యాజమాన్యం బిస్కెట్ ఫ్యాక్టరీ పెడుతున్నామని ప్రజలను మభ్య పెట్టి మోసం చేశారని వివరించారు. అదే విధంగా 15 లక్షల లీటర్ల నీటిని ఫ్యాక్టరీకి తరలించారని, దీనికి అనుమతి లేకుండానే పైపులైను కూడా వేశారని తెలిపారు. దీనిపై కలెక్టర్ కూడా కేసు నమోదు చేశారని పీసీబీకి వెల్లడించారు. పీసీబీ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతున్నదని వివరించారు. దీంతో పీసీబీ కంపెనీ ఎం.డి.శ్రీనివాస్‌రెడ్డిని కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. మూడు రోజులు మాత్రం కంపెనీ వ్యర్థాలను బయటకు తరలించేందుకు వెసులుబాటు కల్పించింది. ఇది కూడా రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో జరగాలని సూచించింది. ఈ విచారణకు తెలంగాణ భూమి రక్షణ సంఘం నుంచి సూరెపల్లి సుజాత, జగన్మోహన్‌రావు, ఏనుగు మల్లారెడ్డి, సుదర్శన్, మదన్ కుమార స్వామి, మహేందర్‌రెడ్డి, పద్మ అంజలి, శోభ, మల్లేశ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.