పవన్‌కు దమ్ముంటే..
నాపై ఆరోపణలు నిరూపించాలి
– మోదీకి దత్తత పుత్రుడు పవన్, అవినీతి పుత్రుడు జగన్
– రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్
– కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి
కర్నూల్, జులై10(జనం సాక్షి ) : తనపై పదే పదే అసత్య ఆరోపణలు చేస్తు రాజకీయపబ్బం గడుపుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తున్నారని, దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ప్రజల ముందు నిరూపించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పవన్‌కు సవాల్ విసిరారు. మంగళవారం కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూడూరు మండలం నాగలాపురం పొలాల్లో పంట కుంటలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వం, మంత్రులపై పవన్ చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీరియస్‌గా స్పందించారాన్నారు. మరోవైపు 30 ఏళ్ల పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబుకు ఓటు వేయాలో… 16 నెలల జైలు అనుభవం ఉన్న వైఎస్ జగన్‌కు ఓటేస్తారో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో భారతీయ జనతా పార్టీ నేతలు, ప్రత్యేక ఉత్తరాంధ్ర పేరుతో పవన్ కళ్యాణ్ ప్రాంతీయ, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రధాని మోదీ దత్తత పుత్రుడు
పవన్ కళ్యాణ్ అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పుత్రుడు చంద్రబాబు అయితే అవినీతి పుత్రుడు జగన్ అని విమర్శించారు. ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించామన్నారు. ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
రైతుగా మారిన లోకేష్..
కోడుమూరు మండలం పాలకుర్తిలో మంత్రి నారా లోకేష్ రైతుగా మారారు. ఎద్దుల బండి ఎక్కి సందడి చేశారు. వ్యవసాయానికి సంబంధించి రైతులతో పలు అంశాలపై మాట్లాడారు. పొలంలో కలుపు మొక్కలను తొలగించే యంత్రాన్ని, డ్రిప్ పరికరాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న మంత్రి లోకేష్ మహిళ పోలీసుల సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం గూడూరు మండలం, నాగులాపురం గ్రామ పొలాల్లో పంటకుంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక, స్థానిక తెదేపా ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.