పశువులకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలి

కరీంనగర్‌, జూలై 18 : ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగరరావు అన్నారు. మెట్‌పల్లి మండలంలోని రేణికుంట గ్రామంలో బుధవారం నాడు ఆయన పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వమే పశువులకు ఉచితంగా వైద్యాన్ని అందించి పశువుల యాజమానులను ఆర్థికంగా అదుకోవాలని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న మాయమాటలతో ప్రజలను మోసగిస్తూ కాలం వెల్లబుచ్చుతున్నాదని అభివృద్ధి కుంటుపడిపోయిందని ఆయన అన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వల్ల రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పశువులకు దాణా లేక అల్లాడిపోతున్నాయని ప్రభుత్వమే వాటికి దాణాను అందించే ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, ఎంపిటిసి మోహన్‌రెడ్డి, గంగాధర్‌, రాజేశ్వరరెడ్డి, పశువైద్య అధికారులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.