పాక్‌కు చేరుకున్న ముషారఫ్‌

కరాచీ, మార్చి 24 (జనంసాక్షి):
పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ నాలుగేళ్ల ప్రవాసం తర్వాత  ఆదివారం నాడు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పాకిస్తాన్‌కు తిరిగి వస్తే హతమారుస్తామంటూ పాకిస్తాని తాలిబన్‌లు ఆయనను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాడి మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఆల్‌ పార్టీ ముస్లింలీగ్‌ను ముందు ఉండి నడిపేందుకు ఆయన తిరిగి పాకిస్తాన్‌కు వచ్చారు. ప్రత్యేక ఏయిర్‌క్రాఫ్ట్‌లో ఆయన దుబాయి నుంచి ఇక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన విమానాశ్రయం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని భావిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రవాసంలో ఉన్న ముషరఫ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. 2007 మాజీ ప్రధాని బేనజీర్‌భుట్టో హత్య కేసులో ఆయన నిందితుడు. ఆమెకు తగినంత భద్రత కల్పించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బలోచ్‌లో నవాబ్‌ అక్బర్‌ హత్య కేసులో, 2007లో న్యాయధికారులను ఒకేసారి తొలిగించి నిర్భందించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 2009లో ప్రవాసంలోకి వెళ్లినప్పటి నుంచి ఆయన పలు సందర్భాలలో మాట్లాడుతూ, తాను తిరిగి స్వదేశం రావలనకుంటున్నట్లు ప్రకటించారు. తాలిబన్ల హెచ్చరికలు కాని, తనపై పెట్టిన కేసులకు కాని తాను భయపడబోని ముషరఫ్‌ చెప్పారు. తనపై పెట్టిన కేసులు అన్ని రాజ్యంగ విరుద్ధమని ఆయన కొట్టిపారేశారు.