పాక్‌లో మరో సంక్షోభం

ప్రధాని అరెస్టుకు సుప్రీం ఆదేశం
ఇస్లామాబాద్‌, జనవరి 15(జనంసాక్షి):
ఆందోళనలతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌లో మరో సంక్షోభం తలెత్తింది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్‌ ప్రధాన మంత్రి రజా పర్వేజ్‌ను ఆష్రఫ్‌ను అరెస్టు చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యుత్‌ ప్రాజెక్టుల కేటాయింపుల్లో జరిగిన రూ.22 బిలియన్‌ డాలర్ల అవినీతికి ఆయనే బాధ్యుడని, ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఇఫ్తికర్‌ మహమ్మద్‌ చౌదరి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసినట్లు జియో టీవీ వెల్లడించింది. ప్రధాని సహా 16 మంది నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని నేషనల్‌ అకౌంటేబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ)ను ఆదేశించింది. బుధవారం వారిని కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించింది. విద్యుత్‌ ప్రాజెక్టుల కేటాయింపులపై ఎన్‌ఏబీ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈ సంచలన నిర్ణయం వెలువరించింది. ప్రధాని అష్రాఫ్‌ సహా ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మాజీ కార్యదర్శులతో కలిపి మొత్తం 16 మందిని నిందితులుగా ఎన్‌ఏబీ నివేదిక రూపొందించింది. 2008లో విద్యుత్‌, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రధాని అష్రాఫ్‌.. అప్పట్లో విద్యుత్‌ ప్రాజెక్టుల కేటాయింపులకు గాను లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు.. ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని సూచించింది. ఈ ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికలను గడువులోగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల నిర్వహణలో ఆలస్యం చేయకూడదని ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఇఫ్తికర్‌ మహమ్మద్‌ చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గనిర్దేశకాలకు అనుగు ణంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమైందంటూ ఎలక్షన్‌ కమిషన్‌కు సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఏదేం జరిగినా.. గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, ఈ విషయంలో ఎలాంటి వెనకకు తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.