పాక్‌ ప్రధానిగా నవాజ్‌ పట్టాభిషేకం

అమెరికా ఆధిపత్యాన్ని సహించబోం
ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) :
పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా పీఎంఎల్‌(ఎన్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెన్సీలో పాకిస్తాన్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ నవాజ్‌ షరీఫ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మూడోసారి దేశ ప్రధాని పదవిని చేపట్టిన ఏకైక నాయకుడిగా నవాజ్‌ షరీఫ్‌ చరిత్ర సృష్టించారు. మాజీ ప్రధానులు యూసుఫ్‌ రజా గిలానీ, రాజా పర్వేజ్‌ అష్రఫ్‌, పీఎంఎల్‌(ఎన్‌) అగ్రనేతలు, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, అధికారులు పలు దేశాల రాయబారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అనంతరం అంతర్జాతీయ మీడియాతో నవాజ్‌ మాట్లాడారు. అమెరికా ఆధిపత్య ధోరణిని సహించబోమని అన్నారు. అంతకుముందు 342 మంది సభ్యులున్న పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అమెరికా సహా ఇతర దేశాలతో సత్సబంధాలు కొనసాగిస్తామని, అదే సమయంలో ఆధిపత్యం చేయాలని చూస్తే మాత్రం సహించబోమని అన్నారు. సోదర దేశం భారత్‌తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆర్థికమాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న దేశానికి జవసత్వాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.