పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అరెస్టు
ఇల్లే సబ్ జైల్
గృహ నిర్బంధంలో మాజీ నియంత
ఇస్లామాబాద్, (జనంసాక్షి) : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సైనిక నియంతను అరెస్టు చేయడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే తొలిసారి. ముషారఫ్‌ను అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మాయమైన ఆయనను పోలీసులు ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేజిస్టేట్ర్ ఎదుట ప్రవేశపెట్టగా రెండ్రోజుల కస్టడీ విధించారు. ముషారఫ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ విధించారు. 60 మంది న్యాయమూర్తులను ఏకపక్షంగా పదవుల నుంచి తొలగించి, వారిని నిర్బంధించిన కేసులో బెయిల్ గడువు ముగియడంతో ఆయన గురువారం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరయ్యారు. బెయిల్ గడువు పొడిగించాలని పెట్టుకున్న ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముషారఫ్ కోర్టు నుంచి పోలీసులకు కళ్లుగప్పి తన అంగరక్షకుల సాయంతో పలాయనం చిత్తగించారు. నగర శివారులోని ఫాంహౌస్‌లో దాక్కున్నారు. శుక్రవారం ఉదయం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే పోలీసులు కోర్టు ఆదేశాలను అమలు చేశారు. సాధారణ వ్యక్తిలా ఆయనను సొంత కారులో మేజిస్టేట్ర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముషారఫ్ వణికిపోయారు. కళ్లల్లో భయాందోళన కనిపించింది.అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు ముషారఫ్‌ను జుడిషియల్ మేజిస్టేట్ర్ మహమ్మద్ అబ్బాస్ షా ఎదుట హాజరుపరిచారు. మాజీ అధ్యక్షుడి తరఫు న్యాయవాదులు, పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ముషారఫ్‌ను రెండ్రోజుల రిమాండ్ విధించారు. 2007లో ఎమర్జెన్సీ విధించి ఇష్టానుసారం వ్యవహరించిన ముషారఫ్‌పై ఉగ్రవాద కార్యాకలాపాల వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో… రెండ్రోజుల రిమాండ్ ముగిసిన అనంతరం ఆయనను ఉగ్రవాద నిరోధక కోర్టులో ప్రవేశపెట్టాలని మేజిస్టేట్ర్ పోలీసులను ఆదేశించారు. మేజిస్టేట్ర్ ఆదేశాల మేరకు ముషారఫ్‌కు గృహ నిర్బంధం విధించారు. ప్రాణ హాని ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయనను జైలుకు తరలించకుండా సొంత ఫాంహౌస్‌నే సబ్‌జైలుగా మార్చి,గృహ నిర్బంధంలో ఉంచారు. ఇస్లామాబాద్ శివార్లలో ఉన్న ఆయన సొంత ఫాంహౌస్‌కు పోలీసులు తరలించి, అక్కడే నిర్బంధించారు. పోలీసులు ఫాంహౌస్‌కు తరలిస్తుండగా.. ముషారఫ్ ఓ విూడియా ప్రతినిధితో మాట్లాడారు. ‘చట్టాన్ని గౌరవిస్తా. పాకిస్తాన్ రావాలని నేను భావించాను. దానికి పర్యవసనాలు అనుభవిస్తాను’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, కోర్టు ఆదేశాలను పాటించకుండా పారిపోయినందుకు ముషారఫ్‌పై మరో కేసు నమోదైంది. ఇదిలా ఉంటే, ఆయన పారిపోతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై నివేదిక సమర్పించాలని ఇస్లామాబాద్ ఐజీకి ఆదేశాలు జారీ చేసింది.పాక్ చరిత్రలో ఎంతో మంది అధ్యక్షులు, ప్రధానమంత్రులు పలుమార్లు అరెస్టు అయినప్పటికీ, ఓ సైనిక నియంత అరెస్టు కావడం ఇదే తొలిసారి. గతంలో జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ అరెస్టు అయి కొంతకాలం జైలులో గడిపారు. కానీ, తన చర్యలకు పర్యవసనాలు అనుభవిస్తున్న తొలి సైనిక నియంత ముషారఫే కావడం గమనార్హం.