పాటను బంధిస్తే కోటి గొంతుకలౌతాం
విమలక్క నిర్భందంపై మండిపడ్డ తెలంగాణవాదులు
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క గొంతునొక్కాలని చూస్తే ఊరుకోబోమని వక్తలు హెచ్చరించారు. శుక్రవారం హైదరబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గత 40 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న విమలక్కను నిర్బంధించడం అక్రమమని మండిపడ్డారు. తెలంగాణపై మాట్లాడకుండా అడ్డుకోవడం మా హక్కులను కాలరాయడమేనన్నారు. విమలక్కను బేషరతుగా విడుదల చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణ వాదులందరూ ఆమె విడుదల కోసం పోరాడాలని కోరారు. అఖిలపక్షం సమావేశానికి ఇద్దరు ప్రతినిధులను పిలవడం సరికాదన్నారు. ఒక్కో ప్రాంతం వారు వేర్వేరు అభిప్రాయాలు చెబితే ఇక ఏకాభిప్రాయానికి తావెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అఖిల పక్షం సమావేశానికి ముందే పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, గాయకుడు గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.