పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ
తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్థులకు బుధవారం ఎంఇఓ కృష్ణకుమారి దాతల సహకారంతో అందించిన ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన కొండారెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరాంజనేయరెడ్డిలు ప్రాధమికోన్నత పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను ఉచితంగా అందించారు. ఈ సందర్బంగా కృష్ణకుమారి మాట్లాడుతూ గ్రామస్తుల సహకారం ఉన్నట్లయితే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని, అదే విధంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా విద్యను అందించగలుగుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలతో పాటు గ్రామ పెద్దలు, పాఠశాల సహ ఉపాధ్యాయులు కోటిరెడ్డి, జగన్, ఎస్ రామ్మోహన్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.