పారిశద్ద్య కార్మికులపై సీఎం వరాల జల్లు

C

– మిఠాయి తినిపించిన కార్మికులు

హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి):

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులతో సహా అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లకు 47 శాతం జీతాలు పెంచడంతో వారు హైదరాబాద్‌ బేగంపేటలోని అధికార నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

ప్రపంచంలోనే హైదరాబాద్‌ నగరానికి మంచి పేరుందని, విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అవినీతి లేకుండా అనుమతులు లభించేలా జీహెచ్‌ఎంసిలో పలు చర్యలు చేపట్టామని, దీనివల్ల మరిన్ని నిర్మాణాలు, వ్యాపార సంస్థలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనివల్ల జీహెచ్‌ఎంసీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందని, పెరిగే ఆదాయానికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కూడా పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఇటీవల జరిగిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో ”సఫాయన్నా?నీకు సలామన్నా” అని తానే అన్నానని, పారిశుద్ధ్య కార్మికులను మాతృమూర్తులతో పోల్చిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనివల్ల సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగిందని చెప్పారు. ఈ జీతాల పెంపు క్రెడిట్‌ తమకే దక్కాలని కొన్ని పనికిమాలిన సంఘాలు కార్మికులను తప్పుదోవపట్టించి, సమ్మెకు ఉసిగొలిపాయని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. రంజాన్‌, బోనాలు, పుష్కరాలు జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులు సమ్మెచేయడం గౌరవంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోనప్పుడే సమ్మెకు దిగితే అర్థం ఉంటుందని హితవు చెప్పారు. ఈ సమ్మె వెనుక కొన్ని ఆంధ్రా పార్టీల నాయకుల హస్తం ఉందని ఆయన విమర్శించారు.

బల్దియా ఆదాయం పెరిగితే విూరు అడగకున్నా జీతాలు పెంచుతానని, యూనియన్ల చక్కర్లు అసలేవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులకన్నా ఎక్కువగానే మున్సిపల్‌ కార్మికులకు జీతాలు పెంచానని చెప్పారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ, పిల్లల విద్య సౌకర్యాలకు ప్రత్యేక చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.

జీహెచ్‌ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ దశలవారీగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు. ప్రతి సంవత్సరం కనీసం వెయ్యి మంది కార్మికులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. ముందుగా అసలే ఇల్లు లేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణం కూడా సిటీ బయట కాకుండా నగరం నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించి ఇస్తామని చెప్పారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో టూ బెడ్‌ రూం ఫ్లాట్లను నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ఈ ఇండ్లను కార్మికుల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.