పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్
కరీంనగర్, జూలై 10 : పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలో అకస్మాతుగా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా పారిశుద్ధ్య పనులు, తాగునీటి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను అడిగి విషయాలు తెలుసుకున్నారు. మంచినీటి సరఫరాలో సమయ పాలన పాటించడం లేదని, ఇష్టమొచ్చిన సమయంలో నీటిని విడుదల చేయడం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అదే విధంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు కూడా సిబ్బంది పూర్తి చేయడం లేదని, కాల్వలోని చెత్తచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతుందని కలెక్టర్‌కు వివరించారు. ఆమెతో ఉన్న అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే గ్రామస్తులు వివరించిన సమస్యలను తక్షణం పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్, ఎండిఓ తదితరులు పాల్గొన్నారు.