పార్లమెంట్‌లో కొలువుదీరిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :
పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమంత్రి పురంధేశ్వరి తయారుచేయించిన 9.3 అడుగుల విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఎంపీలు, కేంద్ర మంత్రి పురందేశ్వరి, హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, పళ్లంరాజు, జైపాల్‌రెడ్డి, చిరంజీవి, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ, బిజెపి నేతలు రవిశంకర్ ప్రసాద్, అరుణ్‌జైట్లీ, ఎస్పీ అధినేత ములాయం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారం ఏచూరి కూడా వచ్చారు. ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా సాగిన కార్యక్రమంలో వీరంతా పాల్గొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పీకర్ పిలుపు మేరకు మంగళవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో బాలకృష్ణ, పార్టీ నేతలు స్వాగతం పలికారు. పార్లమెంట్‌లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం స్పీకర్ విూరా కుమార్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఓ రకంగా యాదృచ్ఛికమే అనుకోవాలి. మీరాకుమార్ తండ్రి దివంతగ బాబూ జగ్జీవన్ రామ్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆయన నేరుగా పాల్గొనడంలో ఎన్టీఆర్ ప్రోత్సాహం ఉంది. ఆనడు హైదారాబాద్ ఎల్‌బి స్టేడియంలో జరిగిన ఓ సభలో జగ్జీవన్ రామ్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడాయన కూతురు చేతుల మీదుగా తన కూతురు చేయించిన విగ్రహంగా ఎన్టీఆర్ పార్లమెంట్ గడప దొక్కారు. 1994లో చంద్రబాబు తిరుగుబాటు చేయకుండా ఉంటే ఆనాడే ఎన్టీఆర్ ప్రధాని అయ్యావారని రాజకీయ విశ్లేషకుల వాదన. సంకీర్ణ రాజకీయాలకు బీజం వేసిన ఎన్టీఆర్ బతికుంటే దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగే వారు. ఈ విగ్రహావిష్కరణకు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్టాన్రికి చెందిన చిరంజీవి, కిల్లి కృపారాణి, బలరాం నాయక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు, సురేష్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, సర్వే సత్యనారాయణ, మంద జగన్నాథం, పల్లం రాజు, రాపోలు ఆనంద భాస్కర్, జయప్రద, మోహన్ బాబు, టిడిపి ఎంపీలు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరు కాలేదు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణకు ఒకరోజు ముందు అంటే సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టిడిపి ఎంపీలు స్పీకర్‌ను కలసి బాబు ఆహ్వానించాలని కోరారు. తనకు ఆహ్వానం అందలేదని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహావిష్కరణలో రాజకీయాలా అంటూ లగడపాటి మండిపడ్డారు. మొత్తానికి విగ్రహావిష్కరణ కల సాకారమయ్యింది. 9 ఏళ్ల టిడిపి పాలనలో జరగాల్సిన కార్యక్రమం కాంగ్రెస్ ఏలుబడిలో జరిగింది.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానంపై రాద్ధాంతం చేస్తున్నారని, ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుపై తర్జన భర్జనలు పడుతున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను వివాదం చేయడం బాధాకరమని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఇవ్వడానికి కేంద్ర మంత్రి పురంధేశ్వరి అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారని, అల్లూరి సీతారామారాజు విగ్రహం ఇవ్వడానికి అడ్డుపడిందెవరని లగడపాటి అన్నారు. తెలుగు జాతి ఐక్యతకు ఎన్టీఆర్ పాటుపడ్డారని, ఎన్టీఆర్ అందరివాడని ప్రతి ఒక్కరూ విగ్రహావిష్కరణ సందర్భంగా అన్నారు. కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి విగ్రహాన్ని ప్రదానం చేశారు. స్పీకర్ కార్యాలయం అధికారులు చంద్రబాబుకు ఫోన్‌చేసి చెప్పడమే కాక, లేఖ కూడా రాయడంతో ఆయన మంగళవారం విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని నిర్ణయించారు. దీంతో ఆహ్వానం విషయంలో పురందేశ్వరి మధ్య ఏర్పడిన వివాదం సమసిపోయింది.