పార్లమెంట్‌లో తొలిరోజు పార్లమెంట్‌లో మార్మోగిన తెలంగాణ


ఉన్నదే అడిగితే ఉలిక్కిపడ్డ సోనియా
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) :
వర్షాకాల సమావేశాల తొలి రోజే తెలంగాణ నినాదాలతో లోక్‌సభ మార్మోగింది. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంపై ప్రకటన చేయాలని పట్టుబట్టడంతో యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ ఉలిక్కిపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తెలంగాణ ఎంపీలను సైగలతో బెదిరించారు. సభలో ‘జై తెలంగాణ’ అని ఎంపీలు నినదించినందుకు సోనియాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నినాదాలు చేస్తూ సభ ప్రాంగణం ముందుకు వెళ్లబోయిన ఎంపీలను సోనియా అడ్డుకున్నారు. సభలో నిశ్శబ్ధంగా ఉండాలని, లేకుంటే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదే సంజ్ఞలతో ఆదేశించారు. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యుడు, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌.కె.అద్వానీ అసోంలో జరిగిన హింసను అరికట్టడంలో యూపీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇదే అదనుగా మిగతా ప్రతిపక్ష సభ్యులు పాలక పక్షం వైఫల్యాలను ఎత్తిచూపుతూ సభలో రగడ సృష్టించారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని నినాదాలు చేస్తూ ముందుకు రాబోయారు. దీంతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిపక్షాలు
సభలో రభస చేస్తున్న సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించడమేందని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని సమస్యలో పెట్టవద్దట్లు సైగలు చేశారు. అంతేగాక, టీఎంపీలు సభ ప్రాంగణం లోపలే నిరసన తెలుపాలని, సభలో పాలకవర్గం సభ్యులుగా నిశ్శబ్ధంగా ఉండాలని ఆదేశించారు. లేదంటే, సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని టీఎంపీలకు సంజ్ఞలు చేశారు. తమ నాయకురాలి నుంచి ఇలాంటి వైఖరిని ఆశించని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మౌనంగా సభ నుంచి బైటికి వచ్చేశారు. ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనా టీఎంపీలు మాత్రం హాజరు కాలేదు. బైటికి వస్తున్న ఎంపీలను ఎందుకు వెళ్లిపోతున్నారని విలేకరులు ప్రశ్నించగా, తమ డిమాండ్‌తో పార్టీని ఇబ్బంది పెట్టలేమని సమాధానమిచ్చారు. తాము నినదిస్తుంటే తమ నాయకురాలు సోనియా గాంధీ తమను సైగలతో బెదిరించలేదని, తమ సమస్య తనకు తెలుసని, త్వరలో పరిష్కరిస్తామన్నట్లు తెలిపారని వెనుకేసుకు వచ్చారు. సోనియా తమపై మండిపడ్డట్లు వస్తున్న వార్తలను టీఎంపీలు ఖండించారు. తెలంగాణ ప్రజలపై సోనియా అనుగ్రహం చూపారని, అందుకే తమ డిమాండును పరిష్కరిస్తామన్నట్లు సైగలు చేశారని కొనియాడారు. తెలంగాణ సమస్య త్వరలోనే తీరనుందని, తమ డిమాండును తమ అధిష్టానం గుర్తించిందని, తమకు ఆ విశ్వాసముందని ఎప్పటిలాగే టీ ఎంపీలు సెలవిచ్చారు.