పార్లమెంట్‌ ఆవరణలో టీ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు గురువారంనాడు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ప్రజల ఆకాంక్షను గుర్తించాలి, తెలంగాణను వెంటనే ప్రకటించాలి, డిసెంబర్‌ 9నాటి ప్రకటనకు కట్టుబడి ఉండాలంటూ ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. అంతకు ముందు ఉదయం ఎంపి వివేక్‌ నివాసంలో తెలంగాణ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందా జగన్నాథం తదితరులు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలలో కొందరు టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే పార్లమెంట్‌ సమావేశాలు ముగిసే వరకు వేచి చూద్దామని కొందరు సూచించడంతో ప్రస్తుతం డోలాయమాన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని స్పష్టమవడంతో ఎంపీలు మందా, రాజయ్య, వివేక్‌ పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ ఎంపీల పట్ల విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తీరును ఎంపి రాజయ్య ఖండించారు. లగడపాటి వ్యాఖ్యలవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ ఖాళీ అవుతోందని ఆయన అన్నారు. లగడపాటి రెచ్చగొట్టడం పార్టీకి చేటు తెస్తోందన్నారు. తెలంగాణ ఎంపీలపై మాట్లాడే హక్కు లగడపాటికి లేదన్నారు. అనవసర విషయాలు వదిలేసి వలసలపై ఆయన దృష్టి సారించాలని హితవు పలికారు.రానున్న రోజుల్లో లగడపాటికి ఇక చిలుకజోష్యమే గతని ఆయన అన్నారు.