పావలా వడ్డీ నాదే..
మహిళలకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు : సీఎం కిరణ్
విశాఖపట్నం, డిసెంబర్ 17 :పావలా వడ్డీ పథకం ఆలోచన తనదేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తన ఆలోచనతోనే ఈ పథకం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తోందని తెలిపారు. ఏటా రూ.1500 కోట్ల వడ్డీని మహిళల తరఫున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ఉద్ఘాటించారు. పట్టణాల్లో మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీఎం కిరణ్ ఇందిరమ్మ బాట సోమవారం ప్రారంభమైంది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ఆయన మల్కాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.83 కోట్ల వ్యయంతో సెంట్రల్ విశాఖకు 24 గంటల పాటు నీటి సరఫరా చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. వివిధ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మహిళలు, స్వయం సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీశారు. ప్రభుత్వం పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయో లేదోనని తెలుసుకునేందుకే ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. పథకాల అమలులో ఎక్కడైనా లోపాలున్నాయా? సక్రమంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా? అన్న అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునేందుకే జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. మల్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో కిరణ్ ప్రసంగించారు. ఇందరా క్రాంతి పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు బాగా లబ్ధి పొందారని అన్నారు. మహిళలు బ్యాంకుల నుంచి రూ.13 వేల కోట్ల రుణాలు తెచ్చుకుంటున్నారని, ఇది రాష్ట్రంతో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మహిళలకు రుణాలు ఇస్తే తిరిగి చెల్లిస్తారనే నమ్మకాన్ని బ్యాంకులు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా రూ.26,500 వేల కోట్లుఖర్చు చేస్తున్నామని, వాటి ఫలాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని, దీనివల్ల 7.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తాను సీఎం అయిన తర్వాత ఇందిరమ్మ, మెప్మాలో ఉన్న రూ.600 కోట్ల బకాయిలు చెల్లించానని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు 1600 భవనాలు నిర్మించేందుకు అనుమతించినట్లు చెప్పారు. ఆర్థిక స్వావలంబనతోనే మహిళలకు గుర్తింపు, గౌరవం లభిస్తుందనే ఉద్దేశంతో వారి కోసం అనేక పథకాలు తీసుకువస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను కూడా మహిళల పేరుతోనే ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. రెండు, మూడు నెలల్లో జరిగే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. మహిళల సమస్యల పరిష్కారానికి స్వయం సంఘాల్లోని సభ్యుల ద్వారా జెండర్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ మహిళలు తిరగాల్సిన అవసరం లేకుండా.. ఈ కమిటీలే సమస్యలను పరిష్కరిస్తాయన్నారు.