గ్రూప్-1పై ముగిసిన విచారణ తీర్పు రిజర్వ్..
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పిటీషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పలువురు గ్రూప్-1 అభ్యర్థులు పిటీషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌లో ఈ పిటీషన్లపై వాదనలు జరిగిన సందర్భంలో హైకోర్టు గ్రూప్-1 నియామకాలపై స్టే విధించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రం పూర్తి చేయొచ్చని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది.సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలి : హైకోర్టుకు మే నెలలో వేసవి సెలవు ఉండటంతో నెల రోజల తర్వాత ఈ పిటీషన్లపై మరోసారి విచారణ ప్రారంభమైంది. న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు విచారణ నిర్వహించారు. విడతల వారీగా జరిగిన విచారణలో ఇరువైపుల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపు, మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య, అభ్యర్థుల మార్కుల వివరాలు ఇలా చాలా అంశాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటీషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదించారు. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.ఎక్కడ కూడా తెలుగు భాష పట్ల వివక్ష లేదు : ఉద్యోగాలకు ఎంపికవని అభ్యర్థులు అపోహలతో పిటీషన్లు దాఖలు చేశారని, పారదర్శకంగా మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే పరీక్షా కేంద్రాల కేటాయింపు జరిగిందని వాదించారు. ఎంత మంది పరీక్షకు హాజరయ్యారనే విషయంలో నామినల్ రోల్స్‌తో పాటు అభ్యర్థుల వేలిముద్రలను పరిగణలోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడిరచామని అన్నారు. తెలుగులో మెయిన్స్ రాసిన అభ్యర్థులు తక్కువ సంఖ్యలో గ్రూప్-1కు ఎంపికయ్యారని, ఇంగ్లిష్‌లో రాసిన వాళ్లు తమ ప్రతిభ ఆధారంగానే గ్రూప్-1కు ఎంపికయ్యారు తప్పితే టీజీపీఎస్సీకి ఎక్కడ కూడా తెలుగు భాష పట్ల వివక్ష లేదని కోర్టుకు తెలిపారు.వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలి : గ్రూప్-1 నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటీషన్‌లపైనా వాదనలు ముగిశాయి. సంవత్సరాల తరబడి కష్టపడి ఉద్యోగం సాధించినా కోర్టు కేసుల వల్ల సకాలంలో నియామకాలు జరగడంలేదని ఇంప్లీడ్ పిటీషనర్ల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు వేసిన పిటీషన్ల వల్ల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం వల్ల నష్టం జరుగుతోందని వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని జడ్జి తెలిపారు.