పావు
అది ఏప్రిల్ నెల. ఎండలు విపరీతంగా ఉన్నాయి. రాత్రైనా చాలా వేడిగా ఉంది. హైదరాబాద్ నగరంలో చిన్న అపారు ్టమెంట్‌లో జీవితం. కరెంటు పోయింది. బాల్కనీ దగ్గర తలుపుతీసి కూర్చున్నాను. బాల్కనీ పక్కన హాలు. లోపల రెండు రూములు. చిన్న కిచెన్. బాత్రూం. లాట్రిన్.’ఆవారా’లోని సంగీతంతో బెల్ మోగింది. కరెంటు లేకపోయినా బెల్ మోతకి బాధ లేదు. బ్యాటరీ తో మోగుతుంది.ఈ చికట్లో ఎవరొస్తారు? ఏ రిమాండో, ఏ మరణ వాంగ్మూలానికి రిక్విజిషనో, అదేమిటోగానీ విపరీతమైన చావులు. ఆత్మహత్యలో హత్యలో, దుర్భనమైన చావులు.ఈ హైదరాబాద్ నగరంలో అన్నీ మనమే. అటెండర్ ఉండడు. ఈ ఉద్యోగంలో ఏదైనా సౌకర్యం ఉందంటే ఈ అటెండర్ ఒక్కటే. అదీ ఈ మహానగరంలో దుర్లభమే.ఈ నెలంతా సికింద్రాబాద్ ప్రాంతం లో మరణ వాంగ్మూలాలు నమోదు చేసే డ్యూటీ నాది. హైదరా బాద్‌కి మరొకరు. పది నెలలకోసారి ఈ భయంకరమైన డ్యూటీ బాధ తప్పదు. అంతకుముందు ఎవరి కోర్టు పరిధిలోనివి వాళ్లం చేసేవాల్లం. కొత్త చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రవేశపెట్టాడీ పద్ధతి. కొంత మంచీ, కొంత చెడూ ప్రతిదాంట్లోనూ ఉన్నట్టే దీ న్లోనూ ఉన్నాయి. రోజూ రెండు మూడు చావులు. రిక్విజిషన్ అర్ధరాత్రే రావొచ్చు. అన్నం తింటున్నప్పుడు రావచ్చు. ఏమైనా స్వేచ్ఛ ఉందా ఈ జీవితంలో.
అన్నీ తెలిసేకదా ఈ ఉద్యోగంలో చేరింది – సీనియర్ల ఉపన్యాసం. అవును మహాప్రభో అన్నీ తెలిసే చేరాను.
ఈ మహానగరంలోనైనా ఈ ఉద్యోగానికి కాస్త స్వేచ్ఛ ఉంటుం దనుకొన్నాను. అదీ లేదు. ఎప్పుడు ఏ రిమాండ్ వస్తుందో తెలి యదు. అందుకని ఇల్లూ, కోర్టూ వదలడానికి వీల్లేదు. వెళ్లినా అనుక్షణం పక్క ఫ్లాటువాడికి ఫోన్ చేసినట్టు ఎవరన్నా పోలీసులు వెయిటింగ్‌ంలో ఉన్నారేమో కాస్త చూసి చెప్పు బాబూ అని వేడు కోవడం. లేకపోయ్యమా – మా సెషన్స్ జడ్జికి మహదానందం. ఎప్పుడు ఏ మెజిస్ట్రేట్ మీద ఫిర్యాదు వస్తుందానని ఎదురు చూస్తుంటాడు. ఏం ప్రభుత్వాలో – ఏం కోర్టుల. కనీసం ఇంటికి ఫోన్ కూడా మంజూరు చేయరు. ‘అన్నీ తెలిసేకదా వచ్చావు. అ డ్వకేట్‌గానే ఉండకపోయావా. సంపాదన కూడా బాగా ఉండేది’ సీనియర్ల ఉపన్యాసం. రెవెన్యూ, పోలీసుల్లో మాదిరిగా బానిస త్వం ఉండదనుకొన్నాను. కానీ ఈ ఉద్యోగం వాటికి మినహా యింపేమీ కాదు. మొన్న రాత్రి మూడు వాంగ్మూలాలు. ఏం ఉంటుంది ప్రశాంతత? ఒక్కదానికే ఎంతో డిస్టర్బ్ అయిపో తాను. మూడు చేసి వస్తే ఇంకెలా ఉంటుంది? కళ్లు మూసినా తెరిచినా వాళ్లే కన్పిస్తారు.మళ్లీ బెల్ మోగింది. మేరానామ్ జోకర్‌లోని సంగీతం. మా ఇంటి ఓనర్‌కి నా జోహారు. కనీసం బెల్‌లోనైనా కళాత్మక దృష్టి ఉంది. నొక్కినప్పుడల్లా కొత్త పాట.
కుర్చీలో నుంచి లేచాను. పక్కనే కూర్చున్న మా ఆవిడ తనలో తాను సణుక్కోవడం ప్రారంభించింది. ఇదేం ఉద్యోగమో ఏమిటో – పోలీస్ ఉద్యోగంలాగే ఉంది. అడ్వకేట్‌గా ఉన్నా బాగుండేది. కాస్త ఆత్మాభిమానం చంపుకొని ఓపీలు సంపాదిస్తే డబ్బుల మీద డబ్బులు. అట్లా దిగజారకుండా వచ్చినందుకు ఏముంది సుఖం?
‘ఎవరో ఏమిటో అడిగి తలుపు తీయండి. అసలే చీకటిగా ఉంది’ సణుక్కొంటూనే అంది.టార్చీ తీసుకొని తలుపు తీశాను. ఎదురుగా హెడ్ కానిస్టేబుల్. అతని చేతిలో కాగితాలు.
‘ఏమిటీ డీడీయా?’
‘అవున్సార్’
‘ఫిమేల్ బర్న్‌సేనా’
‘అవున్సార్’
‘ఎంత పర్సంటేజీ’
‘సెవంటి సార్’
‘గాంధీయేనా’
‘అవున్సార్’
‘ఎప్పుడు అడ్మిట్ చేసినారు’
‘ఎనిమిది గంటల ప్రాంతంలో సార్’
‘మీరు స్టేట్‌మెంట్ రాసుకొన్నారా?’
‘రాసుకొన్నాం సార్’
‘కాగితాలు, ప్యాడూ ఉన్నాయా’
‘రాసుకొన్నాం సార్’
‘కాగితాలు, ప్యాడూ ఉన్నాయా’
‘ప్యాడ్ లేద్సార్’ గిల్టీగా జవాబిచ్చాడు.
ఇట్లా ఉంటుందనే ప్యాడు రెడీగా ఉంచాను. తీసి అతనికిచ్చాను.
‘ఎట్లా వచ్చారు?’
‘జీప్ ఉంది సార్’
అమ్మయ్య, బతికించాడు. జీపుంది. లేకపోతే ఈ చీకట్లో ఎనిమిది కిలోమీటర్లు స్కూటర్ పైన. బీపీ పెరిగిపొయ్యేది మా ఆవిడకి. సంతోషం జీప్ తెచ్చాడు. ఒక్కోసారి అదీ ఉండదు. మంత్రసాని నౌఖరి స్వీకరించాక ఏది వచ్చినా పట్టక తప్పదు. మొన్నేదో సినిమాలో ‘డీడీ ఎందుకు చేయించలేదూ’ అంటే జీప్ లేదని మేజిస్ట్రేట్ రాలేదంటాడు ఆ ఎస్సై అంత తేలికైపోయింది బతుకు. మరణవాంగ్మూలర బలమైన సాక్ష్యం. ఎలాంటి ఇతర సా క్ష్యాలు లేకుండా కోర్టు దీన్ని నమ్మి శిక్షలు వేస్తుంది. మధ్యలో ఎవరైనా తన్ని దాన్ని చింపేస్తే – చంపేస్తే.
ఈ సంగతి ఓసారి మా సెషన్స్ జడ్జితో అంటే – ‘పోతే పోతారు. రోజుకి ఎంతమంది పోవడం లేదు. మా రోజుల్లో అయితే సైకిళ్లమీద పొయ్యేవాళ్లం’ అంటూ ఉపన్యాసం మొదలు పెట్టాడు. అది మీ ఖర్మ. అప్పుడు స్కూటర్లు లేవు. ఉన్నా కొనుక్కొని చావలేదు. మేం ఇట్లాగే ప్రవర్తిస్తే వచ్చే తరం మమ్మల్ని క్షమించదు. సెలవులు మంజూరు చేయాలంటే కూడా ప్రాణాలు పోయినట్టు. ఆయన కాలంలో ఆయనకి ఏ గాడిద కొడుకూ అడిగిన వెంటనే సెలవులు మంజూరు చేయలేదట. ఆయనే చెప్తాడు శాడిస్ట్ – సెలవు కావాలంటే బ్యాంకు నుంచి డబ్బులు ఇచ్చినట్టు బాధ పడ్తాడు. అతన్ని ఏం అనుకోవాలో. డ్రస్ మార్చుకొని రెడీ అయ్యి కిందికి వచ్చాను. జీప్ బయల్దేరింది. ముషీరాబాద్ దాటి, తరువాత ఎడమవైపు నుంచి చిన్న రోడ్డులో నుంచి బయల్దేరి గాంధీ హాస్పిటల్ మార్చురీ దాటి, మోండా మార్కెట్ దాటి గాంధీ హాస్పిటల్‌లోకి ప్రవేశించాం. అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. ముషీరాబాద్ దాటిన తరువాత ముక్కు దగ్గర పెట్టుకొని కర్చీఫ్ తీయాల్సిన అవసరం కలుగలేదు. జీపును చూసి ఇన్నర్ గేట్ తెరిచాడు గార్డు. జీపు సరాసరి ఉమెన్స్ బర్న్స్ వార్డు వద్దకి వెళ్లి ఆగింది. హెడ్ కానిస్టేబుల్ త్వరత్వరగా వెళ్లి గ్రిల్ గేట్ తట్టాడు. కాస్సేపటికి కళ్లు నులముకొంటూ నర్స్ గేటు తీసింది. మేజిస్ట్రేట్ వచ్చారని చెప్పాడు. ఆమె మా రాకని ఊహిస్తూనే ఉంది.
‘పేషంట్ పరిస్థితి ఎలా ఉంది?’ అడిగాను.
‘స్పృహలో ఉంది. ఇంకా సెడెషన్స్ ఇవ్వలేదు’ జవాబు చెప్పింది.
డ్యూటీ డాక్టర్‌ని పిలిపించమని చెప్పాను. ఆమె ఫోన్ చేయడం మొదలు పెట్టింది. ఆలస్యం అవుతుందని హెడ్ కానిస్టేబుల్ని డ్యూటీ డాక్టర్ రూం వద్దకి పంపించాను. డాక్టర్లు సమయానికి రారు. వాళ్ల ఇబ్బందులేమిటో. గట్టిగా అడిగితే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారని చెప్తారు. పీజీ స్టూడెంట్లైనా అందుబాటులో ఉంచొచ్చు. అదీ చెయ్యరు. ఓసారి డాక్టర్ రావడానికి అరగంట పట్టింది. నర్స్ రూంలో కూర్చున్నాను. ఆ రూం చిన్నగా ఇరుగ్గా ఉంది. రెండు కుర్చీలు, ఓ టేబిల్. దానిపైన ఫోనూ కేస్ షీట్లూ, కాగితాలు. కుర్చీ వెనుక చిన్న టేబిల్. దానీ మీద మందులు, కాటన్ వగైరా. కాగుతున్న సిరంజీలు. పక్కనే చిన్న వాష్‌బేసిన్. అదేరూంలో నిద్ర పోవా లేమో. ఆమెకి నిద్ర ఉంటుందా? ఈ పేషంట్లతోని, ముఖ్యం గా అక్కడ ఉన్న వాసనతోని.
(మిగతా వచ్చే బుధవారం)