పిలిస్తే పలుకుతాం

కేవలం 100కు డయల్‌ చేయండి
డీజీపీ దినేశ్‌రెడ్డి
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఎపిఇఎంఎస్‌): పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు, సమన్వయం పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని డిజిపి దినేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం డిజిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డయల్‌-100 సేవలతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వైద్యం మినహా ఏ కేసుకైనా డయల్‌-100 ఫోన్‌ చేయవచ్చునని అన్నారు. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంనుంచైనా డయల్‌-100కు ఫోన్‌చేస్తే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారని డిజిపి అన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కిడ్నాప్‌, హత్య, బాంబు పేలుళ్ళు, అత్యాచారాలు, గృహ హింస, దోపిడీ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు డయల్‌-100 ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఫోన్‌ చేసిన నాలుగు నిముషాల్లోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుంటారని అన్నారు. ప్రజా సేవలో ప్రజలకు సేవలందిస్తే వారిలో ఎనలేని సంతోషం, సంతృప్తి కలుగుతుందని అన్నారు. ప్రజల వద్దకే పోలీసులు అన్న భావంతో సంఘటనా స్థలానికి వారు చేరుకున్న వెంటనే కేసులు నమోదు చేస్తారని తెలిపారు. సంఘటన తీవ్రమైనదైనపుడే ఈ సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులకు ధ్వంసం చేసేందుకు పాల్పడే వారిని కూడా డయల్‌-100 సేవతో పట్టుకునే వీలుంటుందని అన్నారు. రాష్ట్రంలో క్రైమ్‌ రేటును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని డిజిపి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న పోలీస్‌ స్టేషన్లలో రిసెన్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఏ రకమైన ఫోన్‌నుంచైనా డయల్‌-100కు చేసే సౌకర్యం ఉందని అన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే తమ లక్ష్యమని డిజిపి అన్నారు.