పుంజుకోనున్న వ్యవసాయ పనులు
సాగు ప్రణాళిక సిద్దం చేస్తోన్న అధికారులు
నిజామాబాద్,నవంబర్23(జనంసాక్షి): ఈసారి అంచనాలకు మించి వరి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జలాశయాలన్నీ నిండుగా ఉండటం, భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో ధాన్యం ఉత్పత్తికి భరోసాగా ఉండేది. వరుసగా రెండేళ్ల కరవు తర్వాత ఈసారి రెండో పంటకు పుష్కలమైన నీరుండటంతో పూర్తి స్థాయిలో పంటలు వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. యాసంగి సీజన్
ప్రారంభమైనా సాగు ఊపందుకోలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వ్యవసాయ పనులు పూర్తిగా మందగించాయి. పంటలు ఇంకా అమ్ముకోలేక, అమ్ముకున్నా చేతికి డబ్బులందక బిక్కమొహం వేశారు. ఇప్పటివరకు వర్ని, బీర్కూర్, కోటగిరి, బాన్సువాడ, రెంజల్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో నార్లు పోసుకున్నారు. ముఖ్యంగా కూలీల కొరత, విత్తనాలు, ఎరువుల సేకరణకు ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంట అమ్ముకున్న డబ్బులు ఇప్పటికీ రాలేదు. ఇప్పటికే ఆరుతడి
పంటలైన అపరాలు, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, తదితర పంటలు వేశారు. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగు వైపు దృష్టి సారించేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే సంప్రదాయ వంగడాలకు పోకుండా కొత్త రకాలను ఎంపిక చేసుకుంటే చీడపీడలు ఉద్ధృతి తగ్గి, దిగుబడులు ఎక్కువగా సాధించుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అవసరమైన విత్తనాలు మార్కెట్‌లోకి విడుదల చేయడం జరిగింది. ధ్రువీకరించిన సంస్థల నుంచే విత్తనాలను ఎంపిక చేసుకుంటే రైతులు నష్టపోకుండా అధిక రాబడికి అవకాశం ఉంటుందని నిపుణులు వెల్లడించారు.