పురపోరుకు ఈసీ కసరత్తు
` మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధ:
` ఈనెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా
` ఈ మేరకు ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికలపై ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ రాణికుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 13 నాటికి పోలింగ్‌స్టేషన్ల వివరాల ముసాయిదా ప్రచురించాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. ఈ నెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకంపై చర్చించారు. ఇప్పటికే జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించిన ఈసీ.. గురువారం రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి ప్రతినిధులతో సమావేశం కానుంది. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


