విలువైన ప్రభుత్వ భవనాలు.. నిరుపయోగం

జడ్చర్ల, జూలై 9 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. విలువైన ప్రభుత్వ భవనాలు సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలు ప్రస్తుతం ఎవరికీ ఉపయోగపడకుండా పాడుబడుతున్నాయి. ముఖ్యంగా కావేరమ్మపేటలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ అతిథి గృహం, అదే ప్రాంతంలో ఉన్న ఆర్ అండ్ బి కార్యాలయం, వాటి పక్కనే ఉన్న మోర్త్ భవనం ప్రస్తుతం ఎటువంటి వినియోగం లేకుండా ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు కావేరమ్మపేట గ్రామంలోని గ్రామ చావిడి, పాత పశువుల ఆసుపత్రి, బాదేపల్లి పాత కమ్యూనిటీ ఆస్పత్రి భవనం, తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న పాత భూసార పరీక్షా కేంద్రం భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. పట్టణంలో సుమారు 15 ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్న వేళ, ప్రభుత్వమే నిర్మించుకున్న ఈ భవనాలు ఇలా వృథాగా పడి ఉండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఖాళీగా ఉన్న ఈ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు లేదా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు కేటాయించి, ప్రభుత్వ ఆస్తులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు