కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించి ప్రైవేట్ పాఠశాలల ఫీజులను క్రమబద్ధీకరించాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్

హయత్‌నగర్, జూలై 9 (జనం సాక్షి) తెలంగాణలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు జూలై 10న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ హయత్‌నగర్ మండల కార్యదర్శి బొంగు అరుణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను పుట్టా లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రం లోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను క్రమబద్ధీకరించాలని, ఉపకారవేతనా లపై ప్రభావం చూపుతున్న జీవో నంబర్లు 7, 8, 9 లను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యారంగ పరిరక్షణ కోసం జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి చింత వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు భుక్య వినోద్ నాయక్, కార్యవర్గ సభ్యుడు ఈనపల్లి ఉపేందర్, మండల సంయుక్త కార్యదర్శి జూనోతల భాను ప్రకాష్ తో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు