పూర్వ విద్యార్థుల దాతృత్వం అభినందనీయం – డీఎస్పీ నాగభూషణం
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల దాతృత్వం అభినందనీయమని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం అన్నారు.బుధవారం ఆ కళాశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాల వైస్ చైర్మన్ కె.రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చదువుకున్న కళాశాలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్న పూర్వ విద్యార్థుల సంఘాన్ని అభినందించారు.చదువు పూర్తయిన తర్వాత తాము చదువుకున్న కళాశాలను మర్చిపోతున్న నేటి తరానికి పూర్వ విద్యార్థుల సంఘం ఆదర్శనీయమని అన్నారు.కేవలం పది రూపాయలతో అందిస్తున్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.విద్యార్థులు నైతిక విలువలు, సేవా భావన, సంస్కారం లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలని, అవి మంచి సమాజ నిర్మాణానికి పునాది లాంటివని అన్నారు.అనంతరం దాతలైనటువంటి లక్ష్య , ఆది , చిరువెళ్ళ గిరిబాబు, పూర్వ విద్యార్థుల సంఘం వైస్ చైర్మన్ పటేల్ నరసింహారెడ్డి,జార్జి గౌడ్ లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ వి. వెంకటేశులు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కర్నాటి కిషన్ , ఎన్ సీసీ కోఆర్డినేటర్ వడ్డానం శ్రీనివాస్ , ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కవిత , అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.