పెట్రోలు, కరెంటు, కార్లు … మరింత ప్రియం కాబోతున్నాయి

న్యూఢిల్లీ : వినియోగదారులపై ‘పర్యావరణం’ దెబ్బ పడబోతోంది. విద్యుత్తు, ఇంధనం, కార్లు వంటివాటి కోసం రాబోయే రోజుల్లో అధిక ధరలు చెల్లించక తప్పదు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలకు అనుగుణంగా కంపెనీలు ఆధునిక సాంకేతిక యంత్రాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అంటే కంపెనీలు అదనంగా ఖర్చు పెట్టక తప్పదు. ఆ భారాన్ని సహజంగానే వినియోగదారులపై మోపుతాయి.
2020 ఏప్రిల్ నాటికి భారత్ స్టేజ్-6 ప్రమాణాలను సాధించాలన్న లక్ష్యంతో నడుస్తుండటంతో ఇంధనాల ధరలు లీటరుకు దాదాపు 70 పైసల చొప్పున పెరగవచ్చు. అదేవిధంగా విద్యుత్తు ప్రతి యూనిట్‌కు 50 పైసలు పెరిగే అవకాశం ఉంది. కార్ల ధరలు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు పెంచుతారని సమాచారం. ఈ ధరలపై రూపాయి మారకం విలువ, రిఫైన్డ్ ప్రొడక్ట్‌ల ధరలు, రవాణా ఖర్చులు వంటివి ప్రభావం చూపుతాయి.