పెరిగిన ట్రాఫిక్‌కు విరుగుడు మెట్రో విస్తరణనే..

Untitled-1ఉద్యోగుల వేతన సవరణ కోసం సీఎం కసరత్తు

హైదరాబాద్‌ జనవరి12(జనంసాక్షి): ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించడానికి విరుగుడు మెట్రో రైలు ప్రాజెక్టేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. నగరంలో శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని ఆయన సూచించారు. రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. నగరంలో మెట్రోరైలు పనులపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎల్‌ అండ్‌ టి ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బాలసుబ్రమణ్యం, ఎండి గాడ్గిల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు పనులు పూర్తయినా రవాణా అవసరాలు పూర్తిగా తీరవని అన్నారు. ప్రస్తుతం మెట్రోరైలు ప్రాజెక్టు పరిధి అవతల కూడా నగరం బాగా విస్తరించిందని ఉప్పల్‌, నాగోల్‌, ఘట్‌కేసర్‌, తిరుమలగిరి, హయత్‌నగర్‌, పటాన్‌చెరువు, తదితర ప్రాంతాల్లో విస్తరణ చేపట్టాల్సి ఉందని దీనిపై అధ్యయనం చేయాలని కోరారు. ఏటా నగరంలో పది లక్షల వరకు జనాభా పెరుగుతోందని, ఇప్పటికి జనాభా కోటి దాటిందని, దీనికి తగ్గట్టు రవాణా వ్యవస్థ మెరుగుపడాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో సిసి కెమెరాల సంఖ్య పెంచి నిఘావ్యవస్థను పటిష్ట పర్చాలని చెప్పారు. ఈమేరకు ముంబయి లో ఎల్‌ అండ్‌ టి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిసి కెమెరాల పనితీరును పరిశీలించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ భవనాన్ని కూడా త్వరితగతిని నిర్మించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ లో స్కైస్కాపర్స్‌, స్కైవేస్‌ తదితర ప్రతిష్ఠాత్మక నిర్మాణాలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఎల్‌ అండ్‌ టి నుండి ప్రతిపాదనలు కోరారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. ఉద్యోగుల వేతనాలను పెంచాలనే విషయంపై నిర్ణయానికి వచ్చారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి పిఆర్‌సిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శులు శివశంకర్‌, రామకృష్ణారావులతో సమీక్ష నిర్వహించారు. అధికారుల ప్రతిపాదనలను పరిశీలించారు. ఎంత మేర ఫిట్‌మెంట్‌ అమలు చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఐఏఎస్‌ అధికారులతో కమీటిని నియమించారు. ఈ కమీటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి వేతన సవరణకు సంబంధించిన తుది ప్రతిపాధనలు ప్రభుత్వానికి అందిస్తుంది. ప్రదీప్‌చంద్ర ఛైర్మన్‌గా ఉండే కమీటిలో ఎంజీ, గోపాల్‌ ఆచార్య, సభ్యులుగా, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్‌ కన్వీనర్‌గా ఉంటారు.