పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండుతున్న సింగరేణి

అవసరమయితే తప్ప బయటకు రాని జనాలు
కొత్తగూడెం,మే21(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలతో సింగరేణి మండిపోతోంది. ప్తర్యేకించి సింగరేణి కోల్‌బెట్ల ఏరియాలో ఎండల తీవ్రతతో ప్రజలు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనావేస్తున్‌ఆనరు.  రోజురోజుకు ఎండలు మండిపోవడంతో  సూర్యప్రతాపంతో జనం తల్లడిల్లిపోతున్నారు. వారంరోజులుగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 దాటితే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సింగరేణి కార్మిక ప్రాంతంలో బొగ్గు గనుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో కార్మిక ప్రాంతం భగ్గుమంటోంది. భద్రాచలం, చర్ల, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాలలో ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇప్పటికే 42డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరడంతో జనం బయటకెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 13 నుంచి 20 వరకు కనిష్టం 28 డిగ్రీల నుంచి గరిష్టం 43 డిగ్రీల వరకు పెరిగినట్లు వాతావరణశాఖ ఉష్ణోగ్రతలను వెల్లడించింది. దీనికతోడు ఇతర సింగరేణి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు అవసరమయితే తప్ప బయటకు రావడం లేదు. ఎండవేడిమికి ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ బారిన పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు. ఎండలో సాధ్యమైనంత వరకు తిరగకూడదని, అత్యవసరం అయితే తలపాగా, టోపీ ధరించి వెళ్ళాలి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్తే గొడుగును తప్పనిసరిగా ఉపయోగించాలి. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్ళడం వల్ల డిహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు కలిగిన ద్రవపదార్దాలను తీసుకోవాలి. ఎండ వేడిమిని తట్టుకునేందుకు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్లు, పానియాలు తీసుకోవాలి. కర్భూజా, కొబ్బరిబోండాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సేపు ఎండలోప్రయాణం చేస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది కనుక వీలైనంత తక్కువగా ప్రయాణాలను సాగించాలి. ఉదయం, రాత్రి సమయాలలోనే ప్రయాణాలు చేసి వడదెబ్బ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రయాణాలు వాయిదా  వేసుకోవాలన్నారు.