పేకమేడేనా ?

కలవరపెడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌
రెండో టెస్ట్‌లో ఘోర వైఫల్యం

ఇంగ్లడ్‌లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఘోర పరాజయం పొందిన భారతజట్టు స్వదేశంలో నిర్వహిస్తున్న సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని సగటు అభిమాని కోరిక. టీమిండియా కెప్టెన్‌, అప్పుడప్పుడు మెరుపులు మెరిపించే మన ఆటగాళ్లంతా బదులు తీర్చుకుని తీరుతామని బీరాలు పోయారు. సిరీస్‌ ప్రారంభానికి ముందు మొదలైన రంజీ ట్రోఫి ప్రారంభ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా స్థాయికి తగ్గట్టుగా రాణించి అభిమానుల్లో ఆశలు రేకిత్తించారు. ఇక బ్రిటిషర్లకు వైట్‌వాష్‌ తప్పదని అంతా భావించారు. కానీ తొలిటెస్ట్‌ మొదటి రోజు ఆట ప్రారంభమయ్యేకే అసలు కథ మొదలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన మన ఆటగాళ్లు ఇంగ్లిష్‌ బౌలర్ల దాటికి విలవిల్లాడారు. చతేశ్వర్‌ పుజారా డబుల్‌ సెంచరీ సాధించకపోయి ఉంటే మొదటి టెస్ట్‌లో భారత విజయం అంతసులభం కాదనే విషయం అందరికీ తెలిసిందే. పుజారా ఒంటరి పోరాటానికి ఆఫ్‌ స్పిన్నర్‌ రవించద్రన్‌ అశ్విన్‌ తోడ్పాటునందించి హాఫ్‌ సెంచరీ సాధించి జట్టు గౌరవ ప్రధమైన స్కోర్‌ సాధించేందుకు దోహదపడ్డాడు. భారత్‌ భారీ స్కోర్‌కు ప్రతిగా బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లడ్‌ మొదట్లో కాస్త తడబడింది. ఓపెన్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన కెప్టెన్‌ అలిష్టర్‌ కుక్‌ చివరి వరకు పోరాడారు. అతడిని సహచరుల తోడ్పాటు కరువవడంతో భారత స్పిన్నర్లు ఇంగ్లడ్‌ను చాపచుట్టేశారు. భారీ ఆధిక్యం లభించడంతో కెప్టెన్‌ ధోని ఇంగ్లడ్‌ను ఫాలో ఆన్‌ ఆడించాడు. పరువు దక్కించుకునే క్రమంలో కెప్టెన్‌ కుక్‌ ముందుండి పోరాడాడు. సహచరుల సాయంతో భారత్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించకుండా అడ్డుకున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం పుజారా బ్యాటింగ్‌. మిస్టర్‌ డిపెండబుల్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ నిష్క్రమణతో జట్టులో చోటు దక్కించుకున్న పుజారా తన వికెట్‌ విలువను గుర్తెరిగి బ్యాటింగ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పాడు. తొలిటెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పుజారా నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. ఉపకండ పిచ్‌లు స్వభావరీత్యా స్పిన్‌కు అనుకూలిస్తాయని అందరికీ తెలుసు. మన స్పిన్నర్లను ఎదుర్కోవడం ఎంతకష్టమో ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌కు తెలియని విషయం కాదు. తొలిటెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తిని రెండో టెస్ట్‌లోనూ కొనసాగించారు. రెండోటెస్ట్‌లోనూ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారతజట్టు ఎప్పట్లాగానే తక్కువస్కోర్‌కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. మాంటి పనేసర్‌ బౌలింగ్‌లో మెలికలకు భారత బ్యాట్స్‌మన్‌ బెంబేలెత్తిపోయారు. మళ్లీ పుజారా తప్ప ఇతర టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయినా ఇక్కడ మీడియా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌నే ఎక్కువగా టార్గెట్‌ చేసింది. గత పది టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో ఆయన మూడంకెల స్కోర్‌ సాధించలేకపోయాడని, రిటైర్మెంట్‌కు సమయం ఆసన్నమైందని కథనాలు అల్లుకుంటూ పోయింది. మాస్టర్‌తో పాటు టీమిండియా కెప్టెన్‌ ధోని, ఫాస్టెస్ట్‌ ప్లేయర్‌ కోహ్లి, యువరాజ్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ అందరూ విఫలమైనా తొలిటెస్ట్‌లో విజయం వారి వైఫల్యాన్ని ఎత్తిచూపలేకపోయింది. జట్టు విజయాలు సాధించినంతకాలం మరుగున పడుతున్న వైఫల్యాలు రెండో టెస్ట్‌లో ఓటమి అంచులకు చేరే సరికి మళ్లీ బహిర్గతమయ్యాయి. ఆదివారం రెండో టెస్ట్‌ మూడోరోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు భారత్‌పై ఆధిక్యత సాధించేందుకు దీటుగా పోరాడింది. కెప్టెన్‌ కుక్‌ అవుటైన తర్వాత కెవిన్‌ పీటర్సన్‌ పోరాట పటిమతో జట్టుకు అండగా నిలిచాడు. 186 పరుగులు సాధించి జట్టుకు 86 పరుగుల అమూల్యమైన ఆధిక్యం ఇవ్వడంలో ప్రధాన భూమిక పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఏ దశలోనూ ఇంగ్లిష్‌ బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. ఓపెనర్‌ గంభీర్‌ మినహా మిగతా టాప్‌ ఆర్డన్‌ బ్యాట్స్‌మన్‌ పనేసర్‌ దాటిని టారెత్తిపోయారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగులు సాధించింది. గంభీర్‌ మినహా మిగతా ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోర్‌ సాధించలేక  పోయాకరు. నాలుగో రోజు ఎవైనా అద్భుతాలు జరిగితే తప్ప భారత పరాజ   యం దాదాపు ఖాయం. ఈనేపథ్యంలో టెండుల్కర్‌ రిటైర్మెంట్‌పై మళ్లీ ఊహా గానాలు ఊపందుకున్నాయి. మీడియా మొత్తం ఈ విషయమైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. అయితే ఇక్కడ మిగతా బ్యాట్స్‌మన్‌ వైఫల్యాన్ని మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండు దశాబ్దాలకుపైగా జట్టుకు పెద్ద దిక్కుగా ఉన్న మాస్టర్‌ జట్టుకు భారంగా మారుతున్నాడా? పొమ్మని చెప్తున్నా జట్టును వీడటం లేదా? ఈ విషయంలో హైదరాబాదీ స్టైలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఒక న్యాయం, మాస్టర్‌కు మరో న్యాయం పాటిస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో వైఫల్యాన్ని బ్యాట్స్‌మన్‌ అసమర్థతగా లెక్కగట్టడం తప్పు. కానీ సొంతగడ్డపై మన ఆటగాళ్లు రాణించకపోవడం అభిమానులను ఎంతగానో బాధిస్తోంది. తొలిటెస్ట్‌లో ఏదో గెలిచాం అనిపించిన టీమిండియా రెండో టెస్ట్‌లో ఓటమి అంచుల్లో నిలవడం సగటు అభిమాని జీర్ణించుకోలేని అంశం.

(జనంసాక్షి, స్పోర్ట్స్‌డెస్క్‌)