పేకమేడ నిర్మించిన కాంట్రాక్టర్లు

అరెస్టుకు రంగం సిద్ధం
ముంబయి, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
థానేలో నెలరోజుల్లోనే ఏండతుస్తుల పేక మేడ నిర్మించి 72 మంది దుర్మరాణానికి కారణమైన కాంట్రాక్టర్ల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ధనార్జనే ధ్యేయంగా కాంట్రాక్టర్లు పాల్పడ్డ దారుణానికి అమాయకులు బలయ్యారు. థానేలో గురువారం రాత్రి ఏడంతస్తుల భవనం కూలడంతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. ఒక్కసారిగా భవనం కుప్పకూల డంతో తల్లిఒడిలో ఉన్న పిల్లలు, ఆదమరిచి నిద్రపోతున్న పిల్లలు, వృద్ధులు ఈ సంఘటనతో కకావికలమయ్యారు. ఎవరికి వారు దిక్కుతోచని స్థితిలో   మిగిలిపోయారు. తమవారు సజీవంగా ఉన్నారో లేదో తెలియని ఆందోళనలతో ఈ దుర్ఘటన నుంచి బతికి బయటపడిన వారు వాపోతున్నారు. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ముమ్మరంగా  సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగి 40 గంటలు దాటినప్పటికీ ఇంకా సహాయక చర్యల్లో నిమగ్నమయి ఉన్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిన్నారులు చిక్కుకుని ఉన్నారని ఆ బృందం సభ్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్యా ఠాకూర్‌ అనే బాలిక తల్లిదండ్రులు ఏమైపోయారో ఇప్పటికీ అంతుపట్టడంలేదు. తనపేరు సంధ్య అనిచెప్పిన ఈ బాలిక తనవారి కోసం ఆస్పత్రిలో ఆతృతతో ఎదురుచూస్తోంది. ఆమెను రక్షించిన వ్యక్తే ఆమె ఆలనాపాలన చూస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల సంధ్యకు సిటీ స్కాన్‌ చేయాల్సిన అవసరం ఉందనిచెబుతున్నారు. కాగా ఈ బాలిక తల్లి తీవ్ర గాయాలతో శుక్రవారం మరణించిందనే వార్తలు వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు తన వారి కోసం ఆందోళనలతో ఎదురుచూస్తున్నారు. పిల్లల కోసం తల్లులు, వారి కోసం పిల్లలు ఆతృతతో ఎదురుచూస్తూ  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చికిత్స పొందుతున్న ఆస్పత్రి ప్రాంగణమంతా రోదనమయమైంది. గాయపడిన వారి పరిస్థితి తెలుసుకున్న వారి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. అయితే చికిత్స పొందుతున్నవారికి సంబంధీకుల మరణ వార్తను చెప్పడంలేదు. సంధ్యతో పాటు ఆస్పత్రికి తీసుకువచ్చిన ఆమె తల్లి పక్క బెడ్‌మీదనే మరణించినప్పటికీ ఈ విషయాన్ని ఆ పాపకు చెప్పలేదు. ఆమె సంబంధీకులు  ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ఉంది.  ఈ దుర్ఘటనల కుటుంబం మొత్తం చనిపోవడంతో వారి ఆచూకి కోసం సమీప బంధువులకు తెలియజేసే అవకాశం కూడా కనబడటంలేదని సహాయక బృందం సభ్యులు చెబుతున్నారు. సంబంధిత గుర్తింపు పత్రాలన్నీ కూడా శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతదేహాలను ఎవరికి అప్పగించాలో తెలియని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ దుర్ఘటన నుంచి బయటపడిన మహ్మద్‌ యామీన్‌ మాట్లాడుతూ తాను కూలిన భవనంలో 5వ అంతస్థులో ఉంటాననిచెప్పారు.  తన చుట్టుపక్కల భవనాలలో రూ.1500లకు అద్దెకు ఇస్తుండగా తాము నివసిస్తున్న భవనంలో రూ.500కు ఇవ్వడంతో ఎంతో మంది ఈ భవనంలోనే అద్దెకు ఉంటున్నారని చెప్పారు. అయితే జరిగిన దుర్ఘటనకు బాధ్యులెవరు? తమకు ఏమిచ్చినా నష్టం భర్తీ కాదని, కుటుంబ సభ్యులను కోల్పోయామని వాపోతున్నారు.  ఇంకా ఎంతో మంది దుర్ఘటనలో కుటుంబీకులను కోల్పోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.