పేదలకు తక్కువ ధరలకే భోజనం
అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో చంద్రబాబు
విజయవాడ,జూలై11(జనం సాక్షి): పేదలకు చౌక ధరలకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. తొలి విడతగా గురువారం 60 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. రూ.5లకు అల్పాహారం, భోజనం అందించే అన్న క్యాంటీన్‌ను విజయవాడలోని భవానీపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్ల అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని ప్రభుత్వం రూ.15కే అందిస్తోంది. క్యాటరింగ్ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250-300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మందికి ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకొనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ చేస్తారు. భవానీపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడి ఆహారాన్ని మహిళలతో కలిసి భుజించారు. క్యాంటీన్ నిర్వహణ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. .అందరూ కడుపునిండా అన్నం తినాలనే అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. క్వాలిటీ, క్వాంటిటీల్లో రాజీపడకుండా పేదలకు ఆహారం అందిస్తామన్నారు. ప్రజల అభిప్రాయాలతోనే పూర్తి పారదర్శకంగా క్యాంటీన్ల నిర్వహణ చేస్తామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగుతుందని హావిూ ఇచ్చారు. అన్న క్యాంటీన్లకు దాతలు విరాళాలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
కడపలో అన్న క్యాంటీన్
కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్‌ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రులు సి. ఆదినారాయణ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్‌లు బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ…కేవలం 5 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం అభినందనీయమన్నారు. మొదటగా కడపలో ఒక క్యాంటీన్ ప్రారంభించామని, త్వరలో మిగతా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
——————