పేదలపై కనికరం లేని పాలన
కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ
ఆదిలాబాద్,జూలై4(జనంసాక్షి): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్లీ తమకే ఓటు వేయాలన్న రీతిలో బిజెపి, టిఆర్‌ఎస్‌లు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కెసిఆర్, మోదీ పాలనను ప్రజల్లో ఎండగడుతూ,ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లు, ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు, దళితులకు మూడెకరాల భూమి వంటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆనాడు నోట్ల రద్దుతో, ఇప్పుడు జిఎస్టీతో కేంద్రం సామాన్యులకు భారం పడేలా చేసిందని అన్నారు. ఇదేనా జిఎస్టీ అంటే అని అన్నారు. రైతాంగం రోడ్డున పడిందని, బీడీ కార్మికులు ఆందోళనచేస్తున్నారని, వస్త్రావ్యాపారాలు మూపడనున్నాయని అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో దేశాన్ని పాలించే నైతికహక్కును బీజేపీ కోల్పోయిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఆనాడు నల్ల కుబేరులకు, బడా కంపెనీలకు కొమ్ముకాసేందుకే అన్నారు. బీజేపీ అవసరాన్ని ప్రజలు కోరుకోవడంలేదని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు, పేదలు పడుతున్న ఇబ్బందులపై కేంద్రంలోని బీజేపీ గుర్తించడం లేదన్నారు. నగదు కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని, బిజెపి తీరును ప్రజల్లో ఎండగడుతామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోజు కూలీ, కార్మికులు, పేదలు, సామాన్యులపై ప్రభావం పడిందన్నారు. జిఎస్టీతో మొత్తంగా వ్యాపార రంగం, వ్యవసాయరంగం కుంటుపడడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీతో రహస్య ఒప్పందం
చేసుకుని లోపాయకారి మద్దతు ఇస్తున్నారని అన్నారు.